
ఎస్సై కొట్టాడని విషం తాగిన యువకుడు
Web desc : ఏలూరు జిల్లా: ఎస్సై కొట్టాడని ఓ యువకుడు పురుగు మందు తాగిన ఘటన ఏలూరు జిల్లా నిడమర్రులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమర్రుకు చెందిన నండూరి శివకార్తికేయ (33) తన మేనకోడలు బంగారు గొలుసుపోవడానికి అదే గ్రామానికి చెందిన వట్టి వేణుగోపాల్ కారణమని ఆరోపించడంతో గత నెల 29న ఇరు కుటుంబాలు ఘర్షణ పడ్డాయి.
రెండువర్గాలు 30న నిడమర్రు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై కేసులు నమోదు కాగా.. మంగళవారం నిడమర్రు బాలవెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఎస్సై రమేష్, పోలీసు సిబ్బందితో బాధితుడు శివకార్తికేయ వాగ్వాదానికి దిగాడు.
తనపై కేసు నమోదు చేసి వేణుగోపాల్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించాడు. ఆ సందర్భంలో బాలాజీ అనే వ్యక్తి కత్తి తిప్పి పరారయ్యాడు.
దీంతో శివకార్తికేయను ఎస్సై జీపులో స్టేషన్‌కు తీసుకువెళ్లి చితకబాదినట్టు శివకార్తికేయ కుటుంబసభ్యులు చెబుతున్నారు. శివకార్తికేయ మద్యం మత్తులో మాట్లాడుతున్నాడని కుటుంబ సభ్యులు చెప్పగా రాత్రికి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించారు.
అయితే కల్యాణోత్సవాల్లో అందరూ చూస్తుండగా ఎస్సై రమేష్ కొట్టాడని, విచారణ పేరుతో స్టేషన్‌లోనూ కొట్టాడని బాధితుడు శివకార్తికేయ బుధవారం పురుగు మందు తాగాడు.
అతడిని తణుకులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా.. పోలీసుల దౌర్జన్యంతో శివకార్తికేయ ఆత్యహత్యకు పాల్పడ్డాడని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం శివకార్తికేయ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
దీంతో బుధవారం రాత్రి ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. వాస్తవాలను తెలుసుకునేందుకు సీసీ ఫుటేజ్‌లు పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తామని చెప్పారు.
ఈ ఘటనలో తప్పు ఎవరిదో గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. డీఎస్పీ వెంట నిడమర్రు సీఐ రజనీకుమార్, కైకలూరు రూరల్ సీఐ రవికుమార్ ఉన్నారు.



