
గురుకుల ఆశ్రమ పాఠశాల విద్యార్థి అదృశ్యం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యమైన ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉట్లపల్లికి చెందిన అవినాష్(12) ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదులాబాద్‌లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మల్కాజిగిరి స్కూల్లో(గురుకుల ఆశ్రమ పాఠశాల) ఏడవ తరగతి చదువుతున్నాడు.
రోజూ వారీగా బుధవారం సాయంత్రం 5:30 గంటలకు స్పోర్ట్స్ యాక్టివిటీ తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు. స్కూల్లో చదవడం ఇష్టం లేదని బదిలీ సర్టిఫికెట్ తీసుకోవాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేసినా వారు పట్టించుకోకపోవడంతో విద్యార్థి వెళ్లిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
విద్యార్థి పాఠశాల వదిలి వెళ్ళినప్పుడు ఆరెంజ్ కలర్ టీ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి ఉన్నాడని, గురువారం స్కూల్ ప్రిన్సిపాల్ రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే 8712662183, 8712662705 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.




