
KCR క్యాంప్ ఆఫీస్‍పై దాడి.. ఆఫీస్‍లోకి చొచ్చుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పొలిటికల్ హైటెన్షన్ నెలకోంది. గజ్వేల్ ప్రజలకు కెసిఆర్ అందుబాటులోకి రావాలని డిమాండ్ చేస్తూ ఆయన కెసిఆర్ క్యాంపు కార్యాలయాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంక్షారెడ్డి ఆధ్వర్యంలో శనివారం పార్టీ శ్రేణులు ముట్టడించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బిగించి బిఆర్ఎస్ పార్టీ, కెసిఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కేసీఆర్ ఇప్పటికే రూ కోటి 20 లక్షల వేతనం, ఇతర అలవెన్సులు పొందినట్లు అంక్షారెడ్డి ఆరోపించారు. గజ్వేల్ ప్రజల సొమ్మును అప్పనంగా మేస్తున్న ఆయనను వెంటనే ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
గజ్వేల్ ప్రజలకు అందుబాటులో ఉండని కెసిఆర్ ఒక్క క్షణం కూడా ఎమ్మెల్యేగా కొనసాగే నైతిక హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేసీఆర్ అందుబాటులో ఉండకపోవడంతో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ నిలిచినట్లు స్పష్టం చేశారు.
ఇప్పటికైనా ఆయన స్పందించకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌజ్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇక్కడి సమస్యల పరిష్కారంలో కేసీఆర్ ఘోరంగా వైఫల్యం చెందగా, గజ్వేల్ ప్రజలు, ముంపు బాధితులను నట్టేట ముంచినట్లు ఎద్దేవా చేశారు. దమ్ముంటే కేసీఆర్ నిర్వాసిత గ్రామాల్లో పర్యటించాలని డిమాండ్ చేశారు.
కెసిఆర్ గజ్వేల్ ప్రజలను గాలికి వదిలినా, పట్టించుకోకున్నా, సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం అడిగినన్ని నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి ప్రజలను నమ్మించి గొంతు కోసిన కేసీఆర్ ను ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలని ఇప్పటికే గవర్నర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు.
కెసిఆర్ క్యాంపు కార్యాలయం అన్నింటికీ అడ్డాగా మరిందని, ఆయన మాత్రం ఇక్కడ అడుగుపెట్టిన దాఖలాలు లేవని విమర్శించారు. వెంటనే కెసిఆర్ క్యాంపు కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేయాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదలకు చేరుతుండడంతో జీర్ణించుకోలేక బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అడ్డు తగులుతున్నట్లు వివరించారు.
కాగా మొదటగా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కెసిఆర్ క్యాంపు కార్యాలయం వద్దకు ర్యాలీ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బిగించడంతోపాటు ధర్నా, నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్త, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, కనకయ్య గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, వెంకటేష్, జిల్లా మైనార్టీ సెల్ నేత సమీర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు, నేతలు సత్యలక్ష్మి యాదగిరి, సంతోష రాములు గౌడ్, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, సారిక శ్రీనివాస్ రెడ్డి, జంగం రమేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ఆస్గర్, అజహర్ తదితరులు పాల్గొన్నారు.




