
టికెట్ తీసుకోవాలని చెప్పిన కండక్టర్.. చెంపచెల్లుమనిపించిన మహిళ
Web desc : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాకా ఆర్టీసీ బస్సులు రణరంగంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే టికెట్ విషయంలో జరిగిన చిన్నపాటి వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది.
టికెట్ తీసుకోవాలని కోరినందుకు ఓ మహిళ ఏకంగా కండక్టర్ పై చేయి చేసుకున్న ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నుంచి విస్సన్నపేట వెళ్లే ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు ఎక్కారు.
బస్సు సింగ్ నగర్ ఫ్లైఓవర్ సమీపంలోకి రాగానే, కండక్టర్ శ్రీనివాసరావు వారి వద్దకు వెళ్లి టికెట్ తీసుకోవాలని కోరారు. ఆ సమయంలో ఆ మహిళలు మూడు ఆధార్ కార్డులు చూపించి, తమకు రెండు టికెట్లు ఇవ్వాలని కండక్టర్‌ను కోరారు.
అయితే, కార్డుల విషయంలో కండక్టర్‌కు, మహిళలకు మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో మాట మాట పెరగడంతో ఆవేశానికి లోనైన ఒక మహిళ, అందరూ చూస్తుండగానే కండక్టర్ చెంప పగలగొట్టింది.
పోలీస్ స్టేషన్‌కు చేరిన వివాదం.. మహిళ ప్రవర్తనతో షాక్ తిన్న కండక్టర్, వెంటనే బస్సును నున్న పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రయాణికులతో సహా బస్సు పోలీస్ స్టేషన్ చేరుకోవడంతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది.
కండక్టర్ తనను అసభ్యకర పదజాలంతో దూషించారని, ఆ అవమానం భరించలేకే తాను చేయి చేసుకోవాల్సి వచ్చిందని సదరు మహిళ పోలీసులకు తెలిపింది. మరోవైపు తాను కేవలం టికెట్ తీసుకోవాలని మాత్రమే అడిగానని, ఎక్కడా అసభ్యంగా ప్రవర్తించలేదని కండక్టర్ స్పష్టం చేశారు.
విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేయడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించి, విచారణ జరుపుతున్నారు. బస్సులోని ఇతర ప్రయాణికుల సాక్ష్యాలను కూడా సేకరిస్తున్నారు.




