
కుటుంబ కలహాలతో ఆత్మ*హత్యాయత్నం..
కుటుంబ కలహాలు ఓ వ్యక్తిని ఆత్మ*హత్యాయత్నానికి దారి తీసిన ఘటన మండల కేంద్రం రాయపోల్‌లో గురువారం కలకలం రేపింది.
మండల పరిధిలోని లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కామోల్ల రాజు అనే వ్యక్తి, భార్య కాపురానికి రాకపోవడం వల్ల మనస్తాపానికి గురై రాయపోల్‌లో గజ్వేల్-రామాయంపేట రహదారి పక్కన ఉన్న వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి ఆందోళనకు దిగాడు.
సుమారు 15 సంవత్సరాల క్రితం కొండపాక మండలం మర్పడగ మధిర గ్రామానికి చెందిన మహిళతో రాజుకు వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గత మూడు నెలలుగా భార్య కాపురానికి రాకపోవడంతో రాజు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
ఈ క్రమంలో గురువారం ఉదయం వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రాజును సముదాయించారు.
చాలా సేపు చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రాజు చివరకు ట్యాంక్‌పై నుంచి కిందికి దిగివచ్చాడు. ఈ ఘటనపై పోలీసులు కుటుంబ వివాదంపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.



