
జలవిహార్ వద్ద భారీ పేలుడు..ముగ్గురికి గాయాలు (వీడియో)
హైదరాబాద్‌లోని జలవిహార్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. అక్కడ నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన ఆర్వో (RO) ప్లాంట్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ప్రమాద ధాటికి ప్లాంట్‌లోని పరికరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో అప్పుల నాయుడు, అంజిల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
మరో బాధితుడు లక్ష్మణ్‌ను సోమాజిగూడలోని జాయ్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆర్వో ఫిల్టర్ లేదా కంప్రెసర్‌లో గాలి ఒత్తిడి విపరీతంగా పెరగడం వల్లే ఈ పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఖైరతాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంతో జలవిహార్ పరిసరాల్లో కాసేపు భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



