
న్యాయవాదిపై సింగర్ మంగ్లీ స్టేషన్ లో ఫిర్యాదు..
Web desc : ప్రముఖ సింగర్ మంగ్లీ తనను సుభా సియపోగు అనే న్యాయవాది వేధిస్తున్నానంటూ నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, అప్రతిష్ఠ పాలు చేస్తానని బెదిరిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
మంగ్లీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తాను రూ.150 కోట్ల మోసానికి పాల్పడ్డానంటూ సుభా సింగబోష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంగ్లీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు.
మార్చి 21న సుభా సియపోగు పేరుతో ఒక వ్యక్తి తనను పరిచయం చేసుకున్నాడని, అప్పటి నుంచి అమర్యాదగా, బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నాడని ఫిర్యాదులో వివరించారు.
తనను కలవాలని సదరు వ్యక్తి తీవ్ర ఒత్తిడి చేశాడని, అందుకు నిరాకరించడంతో సోషల్ మీడియాలో, బయట అప్రతిష్ట పాలు చేస్తానని బెదిరించినట్లు మంగ్లీ ఆరోపించారు.
తనకు ఎలాంటి సంబంధం లేని కరెన్సీ నోట్లు ఉన్న వీడియోలను చూపించి, మరో వ్యక్తితో కలిసి తనపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
ఈ పరిణామాల వల్ల తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంగ్లీ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు, నిందితుడు సుభా సింగబోష్‌పై BNS సెక్షన్లు 79, 351(3) కింద కేసు నమోదు చేశారు.



