
పేదలకు గృహవసతి కల్పించడంలో దేశానికే తెలంగాణ తలమానికం
ఇప్పటివరకు 3 లక్షల ఇండ్ల మంజూరు
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్ :- నిరుపేదలకు గృహ వసతి కల్పించడంలో భారత దేశంలోనే తెలంగాణ రాష్ట్రం తలమానికంగా నిలిచేలా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
దేశంలో ఏ ప్రభుత్వంకూడా 5లక్షల రూపాయిలతో ఇండ్లను నిర్మించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే ఇండ్లతో సంబంధం లేకుండా రాష్ట్రంలో అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు.
పేదవాడికి మరింత చేయూత ఇవ్వాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి ఆదేశాల మేరకు ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లపై సోమవారం నాడు మంత్రిగారు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ పేదవారికోసం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం ద్వారా రాష్ట్రంలో గుడిసెలు అనేవి లేకుండా చేయాలన్నదే ఈ ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
స్వరాష్ట్రంలో సొంత ఇంటి కోసం నిరుపేదలు కన్న కలలు గత ప్రభుత్వ నిర్వాకం వల్ల కలగానే మిగిలిపోయాయన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం పేదలు కన్న కలలను సాకారం చేస్తోందన్నారు.
ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 22,500 కోట్ల రూపాయిలతో 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఇప్పటి వరకు 3 లక్షల ఇండ్లను మంజూరు చేశామని ఇందులో 1 లక్షా 23 వేల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని తెలిపారు.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ బిల్లుల కోసం లబ్దిదారులు ఎదురు చూడాల్సిన పరిస్దితి లేకుండా ప్రతి సోమవారం నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకే నిధులను జమచేస్తున్నట్లు వెల్లడించారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నిర్మాణంలో కొన్ని జిల్లాల పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ కొలిక్కివచ్చిన నేపధ్యంలో పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై దృష్టి సారించాలని ఇందుకు అవసరమైన స్ధలాలను గుర్తించాలని వీలైనంత త్వరలో పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులకు సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, తదితర పట్టణాలలో కూడా ఇదే విధానాన్ని అమలుచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.