
పంచాయతీ కార్యదర్శి పై హత్యాయత్నం.. అసలు ఏం జరిగిందంటే…
జహీరాబాద్ మండల పరిధిలోని అర్జున్ నాయక్ తండా పంచాయతీ కార్యదర్శి పై సోమవారం హత్యాయత్నం జరిగింది. కార్యదర్శి వీరేశం పై తండాకు చెందిన వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు.
గ్రామానికి చెందిన బాల్ సింగ్ (22) అనే వ్యక్తి దాడికి పాల్పడినట్లు ఎస్ఐ. కాశీనాథ్ చెప్పారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
గ్రామంలో నీటి సమస్య తలెత్తకుండా కార్యదర్శి వార్డుల వారిగా నీటి సరఫరాకు చర్యలు చేపట్టారు. కరెంటు సమస్య కారణంగా సరఫరాలో జాప్యం జరిగింది.
దీంతో ఆగ్రహించిన నిందితుడు పంచాయతీ కార్యాలయంలోకి ప్రవేశించి కార్యదర్శి పై ఆకస్మికంగా కత్తితో దాడికి తెగబడ్డాడు. పక్కనే ఉన్న వాటర్ మెన్ కృష్ణ అడ్డుకున్నాడు.
అయినప్పటికీ కత్తి చేయికి గుచ్చుకోవడంతో బలమైన గాయాలయ్యాయి. వాటర్ మెన్ వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఎంపీడీఓతో కలిసి బాధితుడిచ్చిన ఫిర్యాదుతో జహీరాబాద్ రూరల్ ఎస్ఐ. కాశీనాథ్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.