
కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్, బండి సంజయ్ ఆరా…
బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గురువారం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. రెండు రోజులనుంచి కాస్త నీరసంగా ఉండటంతో గురువారం సాయంత్రం కేసీఆర్ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో చేరారు.
కేసీఆర్ ఆరోగ్యంపై యశోద ఆసుపత్రి యాజమాన్యం రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద డాక్టర్లు తెలిపారు.
కేసీఆర్ షుగర్ లెవెల్స్ కాస్త పెరగగా, సోడియం లెవెల్స్ కాస్త తగ్గాయి. ప్రస్తుతం కేసీఆర్ కు షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేసి, సోడియం లెవెల్స్ను పెంచుతున్నామని యశోద హాస్పిటల్ డాక్టర్ ఏంవీ రావు వెల్లడించారు.
కేసీఆర్ ఆరోగ్యంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆరోగ్యం గురించి తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.
అకస్మాత్తుగా కేసీఆర్ అనారోగ్యంతో యశోదా ఆసుపత్రిలో చేరారని తెలియగా ఆయన ఆరోగ్యంపై వాకబు చేశారు. యశోదా హాస్పిటల్ డాక్టర్లు, అధికారులతో మాట్లాడిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మెరుగైన చికిత్స అందించాలని కోరారు.
ప్రతిపక్షనేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ ఆరా తీశారు.
కేసీఆర్‌కు అత్యున్నత, మెరుగైన చికిత్స అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
అమ్మవారి ఆశీర్వాదంతో కేసీఆర్ త్వరగా కోలుకుని దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు.
ఇదిలా ఉంటే కేసీఆర్ తీవ్రజ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. సీజనల్ జ్వరం రాగా సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు.
స్వయంగా యశోద ఆస్పత్రి వైద్యులతో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌కు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. సీఎం ఆదేశాలతో కొంతమంది అధికారులు కూడా యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.