
లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై…
గచ్చిబౌలి మహిళా ఠాణా ఎస్సై కేవై వేణుగోపాల్ ఓ గృహహింస కేసు విచారణాధికారిగా ఉన్నారు.
ఈ కేసులో తన తల్లి పేరు తొలగించాలని ప్రధాన నిందితుడు ఆయన్ను కోరగా రూ.25 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు అనిశాను ఆశ్రయించారు.
ఈ మేరకు గురువారం సాయంత్రం బాధితుడి నుంచి ఎస్సై రూ.25 వేలు తీసుకుంటుండగా అనిశా అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.
ఏఎస్సైగా గచ్చిబౌలి ఠాణాలో పనిచేసిన వేణుగోపాల్ ఎస్సైగా పదోన్నతిపై 8 నెలల క్రితం మహిళా ఠాణాకు వచ్చారు. మరో ఏడాదిలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది.
ఏసీబీ వలలో నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, డ్రైవర్
భూ సేకరణ పరిహారం జమ చేసేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ రాజు(రాజారెడ్డి), డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్య గురువారం అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు పట్టుబడ్డారు.

అనిశా మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల మేరకు.. న్యాల్‌కల్ మండలం హుసెళ్లీ గ్రామానికి చెందిన రైతు మహమ్మద్ మక్బూల్‌కు మూడున్నర ఎకరాలకు సంబంధించి రూ.52 లక్షల పరిహారం రావాల్సి ఉంది. దీంతో డిప్యూటీ కలెక్టర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ సతీష్ కలిసి డ్రైవర్ దుర్గయ్య ద్వారా ఆయనతో బేరసారాలు జరిపారు.
రూ.5 లక్షల లంచం ఇస్తేనే పరిహారం జమ చేస్తామని డిమాండ్ చేశారు. భూములు పోగొట్టుకుంటున్న తనకు న్యాయంగా వచ్చే పరిహారం చెల్లించేందుకు మీకెందుకు డబ్బులు ఇవ్వాలని రైతు అంగీకరించలేదు.
దీంతో అధికారులు నెల రోజుల పాటు డబ్బులు వేయకుండా ఆలస్యం చేశారు. చివరకు మక్బూల్ రూ.65 వేలు ఇస్తానని అంగీకరించడంతో ఆయన ఖాతాలో డబ్బులు వేశారు.
తరువాత నుంచి లంచం డబ్బులు ఎప్పుడిస్తావని ఆయన్ను వేధించడంతో అనిశా అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు మధ్యాహ్నం డిప్యూటీ కలెక్టర్‌ను కలిసి రూ.50 వేలు ఇవ్వబోగా సాయంత్రం ఫోన్ చేసి తీసుకుంటానని చెప్పారు.
తరువాత జహీరాబాద్ పట్టణంలోని నిమ్జ్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌ను కలిసి రూ.15 వేలు ఇస్తుండగా.. అనిశా అధికారులు నేరుగా పట్టుకున్నారు.
ఇద్దరు అధికారులతోపాటు దుర్గయ్యను కూడా అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించారు. మణికొండలోని రాజు, సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని సతీష్, మల్కాపూర్‌లోని దుర్గయ్య ఇళ్లలోనూ అనిశా అధికారులు సోదాలు చేశారు.