
ఒక్కసారిగా పోలీస్ స్టేషన్‌కు 70 మంది విద్యార్ధులు.. ఎందుకో తెలిస్తే బిత్తరపోతారు..
నేరాలు , గొడవలు జరిగితే పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతారు. సమస్యల సాధన కోసం పాఠశాల విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేస్తారు. అవసరమైతే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారు. కానీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లే సమస్యలు పాఠశాల విద్యార్థులకు ఉండవు.
కానీ ఇక్కడి విద్యార్థులు మాత్రం పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కారు. తమ సమస్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ విద్యార్థులకు వచ్చిన సమస్య ఏంటి..? ఎవరిపై విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారో.. తెలుసుకోవాలంటే ఏ స్టోరీ చదవాల్సిందే.
సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో సోషల్ వెల్ఫేర్ ఎస్సీ బాయ్స్ హాస్టల్ ఉంది. ఈ హాస్టల్లో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5 నుంచి 10 తరగతి చదువుకునే 70 మంది విద్యార్థులు ఉన్నారు.
ప్రతిరోజు విద్యార్థులకు సరిపడ భోజనాన్ని హాస్టల్ సిబ్బంది సిద్ధం చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని రోజులుగా హాస్టల్ సిబ్బంది కేవలం 50 మంది విద్యార్థులకు సరిపడే భోజనాలు మాత్రమే సిద్ధం చేస్తున్నారు. దీంతో పాఠశాల నుంచి త్వరగా వచ్చిన మొదటి 50 మంది విద్యార్థులకు మాత్రమే భోజనం సరిపోతోంది.
మిగిలిన 20 మంది విద్యార్థులు భోజనం లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులకు ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి హాస్టల్ వార్డెన్ రవి కుమార్ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేశారు. అయినా హాస్టల్లోనే 70 మంది విద్యార్థులకు సరిపడా భోజనం మాత్రం సిబ్బంది వండడం లేదు.
దీనిపై తీవ్ర నిరాశకు గురైన విద్యార్థులు సిబ్బందిని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా మాట్లాడారు. హాస్టల్ వార్డెన్ రవికుమార్‌ను సంప్రదించే ప్రయత్నం చేశారు. ఆయన అందుబాటులోకి రాకపోవడంతో విసిగిపోయి హాస్టల్లో భోజనం పెట్టకపోవడంతో హాస్టల్ విద్యార్థులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు.
హాస్టల్లో తమకు సరిపడా భోజనం పెట్టడం లేదంటూ వార్డెన్ రవికుమార్‌పై విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న ఎస్సై శ్రీకాంత్.. విద్యార్థులతో కలిసి హాస్టల్‌కు వెళ్లారు.
హాస్టల్ పరిస్థితిని పరిశీలించిన ఎస్సై శ్రీకాంత్.. విద్యార్థుల ఫిర్యాదును వార్డెన్ రవి కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసుల సమాచారంతో హాస్టల్‌కు చేరుకున్న వార్డెన్.. విద్యార్థులకు భోజనాన్ని ఏర్పాటు చేశాడు. అయితే వార్డెన్ స్థానికంగా అందుబాటులో ఉండకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని విద్యార్థులు స్పష్టం చేశారు.
విద్యార్థుల ఫిర్యాదుపై, హాస్టల్ వార్డెన్‌పై ఎలాంటి కేసులు నమోదు చేయలేదని, హాస్టల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని పోలీసులు వార్డెన్‌ను హెచ్చరించారు. ఈ ఘటనపై విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తామని ఎస్సీ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ దయారాణి తెలిపారు.
విద్యార్థులు కడుపు నింపుకోవడానికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన దుస్థితి, హాస్టల్ వార్డెన్ల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. భోజన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత గల అధికారులు, నిర్లక్ష్యం వహిస్తే, విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదం ఉంది.
స్థానికంగా ఉంటూ విద్యార్థుల బాధ్యత చూడాల్సిన వార్డెన్‌పై ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించి , హాస్టల్ నిర్వహణలో పారదర్శకతను, బాధ్యతాయుతమైన విధానాలను తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.