
లారీ బోల్తా.. తొమ్మిది మంది దుర్మరణం
Web desc : అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిచెరువు కట్టపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడటంతో తొమ్మిది మంది కూలీలు మృతిచెందగా.. మరో 12 మంది గాయపడ్డారు.
ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలివి… రాజంపేట మండలం ఇసుకపల్లి గ్రామ పరిసరాల్లోని తోటల నుంచి మామిడికాయలు కోయడానికి రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట ఎస్టీ కాలనీ, తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం వద్దివేడు, కల్వకుంట్ల ప్రాంతాలకు చెందిన 21 మంది కూలీలు ఆదివారం వచ్చారు.
మామిడి కాయల లోడుతో రైల్వేకోడూరు మార్కెట్‌కు వెళ్తున్న లారీపై వీరంతా కూర్చున్నారు. లారీ పుల్లంపేట మండలం రెడ్డిచెరువు కట్టపై అదుపుతప్పి బోల్తా పడడంతో కూలీలంతా లోడు కిందపడ్డారు.
కూలీలను పనికి తీసుకెళ్లిన మేస్త్రీ శివ ఒక్కరే చిన్న గాయాలతో బయటపడగా అతని భార్య చిట్టెమ్మ(25)తో పాటు సుబ్బరత్నమ్మ(45), గజ్జల దుర్గయ్య(32), గజ్జల శ్రీను(33), గజ్జల లక్ష్మీదేవి(36), రాధ(39), గజ్జల రమణ(42), వెంకట సుబ్బమ్మ(37) ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. వద్దివేడు గ్రామానికి చెందిన మునిచంద్ర(38)ను రాజంపేట ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు.
వడమంచిలి వెంకటేశ్, గజ్జల వెంకటయ్య, జి.శీనయ్య, జి.లక్ష్మి, వెంకటరమణ, సిద్దమ్మ, జి.వెంకటేశ్, పోలి వెంకటేశ్, పోలమ్మ, చెంచులక్ష్మి, గంగమ్మ తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.