
మైనర్ బాలికను కిడ్నాప్ చేసేందుకుయత్నం.. తల్లి తీరుతో తప్పిన ప్రమాదం
Web desc : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తి చేసిన యత్నం స్థానికంగా కలకలం రేపుతోంది. తొందరగా స్పందించిన బాలిక తల్లి ధైర్యంతో ప్రమాదం తప్పింది.
వివరాల్లోకి వెళ్తే… గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలిక ఒకటో తరగతి చదువుతూ, మంగళవారం ఉదయం తరగతులకు హాజరైంది. సాయంత్రం ఇంటికి వచ్చిన అనంతరం బహిర్భూమి అవసరార్థం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లింది.
అయితే చాలా సేపటికీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తల్లి తన కుమారుడిని వెంటబెట్టుకుని బిడ్డ కోసం వెతకసాగింది. ఆ సమయంలో పొదల మధ్య నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి పరుగు తీస్తూ అక్కడి నుంచి పారిపోయాడు.
తనను గుర్తు తెలియని వ్యక్తి మెడపై కత్తి పెట్టి కిడ్నాప్ చేసి, తల్లిదండ్రులను డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేయాలని ప్రయత్నించాడని బాలిక తెలిపింది.
“ఒక లక్ష రూపాయలు డిమాండ్ చేసి బెదిరించాడు” అని బాలిక తల్లికి వివరించింది. ఈ మేరకు బాలిక తల్లి తిమ్మాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కిడ్నాప్‌కు యత్నించిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలనే అవసరాన్ని ఈ సంఘటన మళ్లీ గుర్తు చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.