టెక్నీషియన్ లేక ..2డీ ఎకో మిషన్ మూలన!
భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్జనరల్ హాస్పిటల్లో 2డీ ఎకో మిషన్ మూలన పడింది.
లక్షలు పెట్టి కొన్న మిషన్‌ను టెక్నీషియన్ లేరనే సాకుతో ఏర్పాటు చేయకుండా మూలకే పరిమితం చేశారు.
జిల్లాలో ఎక్కడా లేని విధంగా కొత్తగూడెంలోని గవర్నమెంట్జనరల్ హాస్పిటల్‌లోని డయాగ్నోస్టిక్ సెంటర్లో మొదటి సారిగా 2డీ ఎకో మిషన్ ఏర్పాటు చేస్తున్నామని గతేడాది అప్పటి హెల్త్ మినిస్టర్ హరీశ్‌రావు ప్రకటించారు.
2డీ ఎకో మిషన్‌తో ఇక గుండె జబ్బు బాధితులు ఖమ్మం, వరంగల్ హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు చెప్పడంతో జిల్లా ప్రజలు సంబరపడ్డారు. కానీ నెలలు గడుస్తున్నా మిషన్‌ను మూలకు పెట్టారే తప్ప ఏనాడు ఉపయోగించింది లేదు.
దాదాపు రూ.40 లక్షలకు పైగా ఖర్చు పెట్టి తెచ్చిన మిషన్ టెక్నీషియన్ లేక నిరుపయోగంగా మారింది. మరో వైపు కార్డియాక్ డాక్టర్ వస్తారంటూ ఏడాది కాలంగా వైద్యాధికారులు చెబుతున్నారనే తప్ప డాక్టర్ వచ్చింది మాత్రం లేదు.
ప్రైవేట్‌లో వేలల్లో ఖర్చు.. జిల్లాలోని గవర్నమెంట్ హాస్పిటల్లో 2డీ ఎకో మిషన్ లేకపోవడంతో గుండె జబ్బు బాధితులు రూ. వేలకు వేలు వెచ్చించి ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.
ఖమ్మం, హైదరాబాద్ వెళ్లలేక ఇబ్బంది పడుతున్నామని గుండె జబ్బు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఇప్పటికైనా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు 2డీ ఎకో మిషన్ అందుబాటులోకి తచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.