
కేటీఆర్ పర్యటనలో సి ఐ ప్రత్యక్షం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనలో ఓ సీఐ (సర్కిల్ ఇన్స్ పెక్టర్) ప్రత్యక్షం కావడం పోలీస్ శాఖలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. సదరు సీఐ కేటీఆర్ టూర్ లో బందోబస్తు కోసం వచ్చారనుకుంటే మాత్రం పొరపాటే.
ఎక్కడో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉండాల్సిన ఆ సీఐ కేటీఆర్ పర్యటన సందర్భంగా ఖమ్మం వచ్చి మరీ ఆయన రాకకోసం హెలీపాడ్ వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి వేచి ఉన్న ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై మరోవైపు అధికార పార్టీ వర్గాలు కూడా భగ్గుమంటున్నాయి. పూర్తి వివరాల్లోకి వెలితే..
మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చారు. ఇటీవల మృతి చెందిన వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు కేటీఆర్ ఖమ్మం పర్యటనకు వచ్చారు.
హెలీకాప్టర్ లో కేటీఆర్ ఖమ్మం వచ్చిన సందర్బంగా మమత మెడికల్ కళాశాలలో గల హెలీపాడ్ లో ఆయన రాకకోసం బీఆర్ఎస్ నాయకులు ఎదురుచూస్తున్నారు. అయితే కేటీఆర్ కోసం ఎదురుచూస్తున్న బీఆర్ఎస్ నాయకుల మధ్య సివిల్ డ్రెస్ లో గల శ్రీనివాస్ అనే సీఐ కలిసి ఉన్న దృశ్యపు ఉదంతం పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారి తీసింది.
ఖమ్మం జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో గల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని డీసీఆర్బీ లో విధులు నిర్వహించాల్సిన సీఐ శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేటీఆర్ కోసం ఎదురుచూస్తున్న ఘటనపై అధికార పార్టీ నాయకులు కూడా భిన్న రకాలుగా చర్చించుకుంటున్నారు.
గతంలో ఖమ్మం రూరల్ సీఐగా విధులు నిర్వహించిన సీఐ శ్రీనివాస్ అప్పట్లో తీవ్ర వివాదాస్పదమయ్యారు. బీఆర్ఎస్ నాయకుల మాటలు విని సీపీఐ నేతలను వేధిస్తున్నారనే విమర్శలను సీఐ శ్రీనివాస్ ఎదుర్కున్నారు.
ఈ నేపథ్యంలోనే సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత తొలిసారి ఖమ్మం వచ్చిన ప్రస్తుత కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఐ శ్రీనివాస్ వ్యవహార తీరుపై సీరియస్ గా స్పందించారు.
వరంగల్ క్రాస్ రోడ్ లో ఆ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ, రాజకీయాలు చేయాలనుకుంటే ఖాకీ చొక్కా విప్పి రావాలని, చూసుకుందామని సీఐ శ్రీనివాస్ కు సవాల్ విసిరారు. అనంతర పరిణామాల్లో రూరల్ సీఐ శ్రీనివాస్ బదిలీకి గురై ప్రస్తుతం కొత్తగూడెం డీసీఆర్బీలో విధులు నిర్వహిస్తున్నారు.
అయితే కేటీఆర్ ఖమ్మం పర్యటన సందర్భంగా 80 కిలోమీటర్ల దూరం నుంచి ఖమ్మం చేరుకుని మరీ బీఆర్ఎస్ నాయకులతో కలిసి మమత ఆసుపత్రివద్ద హెలీప్యాడ్ వద్ద ప్రత్యక్షమైన శ్రీనివాస్ వ్యవహార తీరు మరోసారి వివాదాస్పదమైనట్లు పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. ఈ వార్తా కథనంలో గల ఫొటోలో రెడ్ సర్కిల్ లో గల వ్యక్తే సీఐ శ్రీనివాస్. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.