
ప్రియుడి ఇంటి ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న మహిళా కానిస్టేబుల్..
ప్రేమించిన తనను కాదని మరో యువతిని ప్రియుడు పెళ్లి చేసుకోవడంతో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించింది. సదరు మహిళా కానిస్టేబుల్ సగం కాలిన దేహంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది.
ఈ ఘటన గురువారం రాత్రి చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని మహిళా కానిస్టేబుల్ కుటంబ సభ్యులు నిరసనకు దిగారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుప్పం మండలం మార్వాడ గ్రామంకు చెందిన వాసు ఇదివరకు ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఆ సమయంలో ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రశాంతికి వాసు పరిచయం అయ్యాడు.
పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆరు నెలల క్రితం ప్రొద్దుటూరులో ఉద్యోగం మానేసిన వాసు.. కుప్పంకు వచ్చేశాడు. ఇటీవల వాసుకు మరో యువతితో వివాహం జరిగింది. అప్పటి నుంచి ప్రశాంతిని వాసు దూరం పెట్టాడు.
ప్రియుడు వాసుకు వివాహం అయిన సంగతి తెలియక కానిస్టేబుల్ ప్రశాంతి బుధవారం మార్వాడ గ్రామంకు వచ్చింది. పెళ్లి విషయం తెలిసి వాసుతో ప్రశాంతి గొడవపడింది.
కుటుంబ సభ్యులు నచ్చచెప్పడంతో ఆమె అక్కడినుంచి వెనుతిరిగింది. ప్రశాంతి గురువారం ఏకంగా పెట్రోల్ బాటిల్‌తో వాసు ఇంటి వద్దకు వచ్చింది. వాసు ఇంటి ముందే ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకుంది. వెంటనే స్థానికులు మంటలను ఆర్పారు.
ఈ ఘటనలో ప్రశాంతికి 60 శాతానికి పైగా గాయాలు అయ్యాయి. కుప్పం పీఇఎస్ ఆసుపత్రిలో ప్రశాంతికి చికిత్స కొనసాగుతోంది. ప్రశాంతి కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.