
పోలీసులకు కేటీఆర్ వార్నింగ్.. ‘మూడేళ్లలో వస్తాం.. వడ్డీతో సహా చెల్లిస్తాం’
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కలెక్టరు, పోలీసు అధికారులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లలో తాము అధికారంలోకి వస్తామని.. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని.. అప్పుడు పోలీసులు, ఐఏఎస్ అధికారులు లెక్కలు తేల్చుతామని హెచ్చరించారు. పోలీసులు.. కాంగ్రెస్ నేతలు చెప్పినట్టల్లా ఆడుతూ.. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
అలాంటి అధికారులందరి పేర్లు బుక్కులో రాసి పెట్టుకుంటున్నామని హెచ్చరించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ భార్యపై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారని.. అసలు ఆ పోలీసులు మనుషులా, పశువులా అంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్‌ను బీఆర్ఎస్వీ విలీనం చేసిన సందర్భంగా శుక్రవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘నిన్నగాక మొన్న మా తమ్ముడు గెల్లు శ్రీనివాస్ దగ్గరకు వెళ్లాం. అతనేవరో థంబ్‌నెయిల్స్.. థుంబ్నెయిల్స్ అని ఇష్టం వచ్చినట్లు వీడియోలు పెడితే.. అతడికి కడుపు మండి ఓ పది మందిని తీసుకొని వెళ్లి శాంతియుతంగా నిరసన తెలియజేశాడు.
దీనికే ఆయనపై అంటెప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కోర్టుకు వెళ్తే దీనిలో ఏముందని రిలీఫ్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు’ అని తెలిపారు. ‘ఇక్కడ మరో విచిత్రమైన అంశం ఎంటంటే.. పోలీసులు.. గెల్లు శ్రీనివాస్ భార్య మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేశారు.
అసలు ఆమె బయటకు వచ్చిందా.. నిరసనల్లో పాల్గొన్నదా.. అనే విషయం కూడా తెలుసుకోకుండా ఆమె మీద ఇంత పెద్ద కేసు పెట్టారు. అది కూడా ఎందుకు.. శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులకు ఆమె తన మొబైల్ ఇవ్వలేదు. అందుకే ఆమె మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేశారు.
అసలు ఎలాంటి సంబంధం లేని ఆ అమ్మాయి మీద కేసు పెట్టిన పోలీసులను నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను.. మీరు మనుషులా.. పశువులా.. బుద్ధి, జ్ఞానం ఉండి ఉద్యోగం చేస్తున్నారా.. లేక గడ్డి తిని చేస్తున్నరా’ అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మూడేండల్లో వస్తం.. ఒక్కొక్కనికీ మిత్తీతో సహా ఇస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. అక్రమ కేసులు పెట్టే అధికారులు ఎవరైనా సరే చివరకు కలెక్టర్ అయినా.. సరే భయపడేది లేదు. అందరి పేర్లూ రాసి పెట్టుకోవాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచిస్తున్నాను. సర్కారుకు తొత్తులుగా పనిచేస్తున్న అధికారులు, పోలీసుల లెక్కలు తేల్చేది పక్కా అంటూ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
రేవంత్ కాదు కదా ఆయన ముత్తాతలకు కూడా భయపడేది లేదని తెలిపారు. సోనియాగాంధీ రాసిన ఉత్తరంలో ఏముందో చదవడం రాక.. అదేదో తనకు ఆస్కార్ అవార్డు వచ్చినట్టు రేవంత్ రెడ్డి మురిసిపోతున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆయనకు ఆస్కార్ కాదు భాస్కర్ అవార్డు ఇవ్వాలని ఎగతాళి చేశారు.