
రాజకీయ బ్రోకర్ సీఎం రమేష్.. కేటీఆర్ ను విమర్శించే స్థాయి అతడికి లేదు..బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
- కాంగ్రెస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి
- స్థానిక ఎన్నికల్లో గులాబి జెండాదే విజయం
ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీఎం రమేష్ ఓ రాజకీయ బ్రోకర్ అని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు విమర్శించారు. ఆంధ్ర రాబంధును కేటీఆర్ పైకి రేవంత్ రెడ్డి ఉసిగొలిపి కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపిండని మండిపడ్డారు. ఒక ప్రకటనలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బ్రోకర్ల ద్వారా నడుస్తున్నదని, నాలుగు నెలల క్రితమే కంచ గచ్చిబౌలి భూములలో ఓ బీజేపీ ఎంపీ హస్తం ఉందంటూ కేటీఆర్ చెప్పారని గుర్తుచేశారు.
కంచగచ్చిబౌలి భూముల అంశంలో పాత్ర ఉన్న ఎంపీకి సంబంధించిన వివరాలు సమయం వచ్చినప్పుడు ఆధారాలతో సహా బయటపెడతామని చెప్పారన్నారు. చంద్రబాబు దగ్గర ఎంపీ సీటు, బీజేపీలో రాజ్యసభ సీట్లను డబ్బులతో కొనుగోలు చేసిన వ్యక్తి సీఎం రమేష్ అని ఆరోపించారు. ఆంధ్రాప్రాంతానికి చెందిన లగటపాటి, కావూరి, సుజన చౌదరిలు చంద్రబాబు రిమోట్ కంట్రోల్ తో పని చేసిన వీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారని తెలిపారు.
మళ్లీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ, కంచ గచ్చిబౌలి భూములను దక్కించుకునేందుకు రేవంత్ రెడ్డి తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని అన్నారు. సీఎం రమేష్ వంటి అధమ స్థాయి నాయకుడి వద్దకు వెళ్లే అవసరం కేటీఆర్ కు ఎంతమాత్రం లేదన్నారు. సీసీ టీవీ ఫుటేజీ పేరుతో చేస్తున్న డ్రామాలను ప్రజలు విశ్వసించబోరన్నారు. సీఎం రమేష్, రేవంత్ రెడ్డి ప్రజల మధ్యలో బహిరంగ చర్చకు రావాలన్న కేటీఆర్ సవాల్ కు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు.
రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలంతా బీఆర్ఎస్ వైపే నిలుస్తారని జోస్యం చెప్పారు. అభివృద్ది చేసిన బీఆర్ఎస్ నాయకులకే గ్రామాల్లోకి వెళ్లి ఓట్లు అడిగే హక్కు ఉంటుందన్నారు. అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన రేవంత్ అన్ని వర్గాలను మోసం చేశాడని అన్నారు. రైతులకు రైతు బంధు లేదు, రైతు బీమా ప్రీమియం కట్టలేదన్నారు. గ్రామాల్లో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో లేదన్నారు. కేసీఆర్ ను బదనాం చేసేందుకే కాళేశ్వరం మరమ్మతులు చేపట్టడం లేదన్నారు. దీంతో రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులు ఎడారిగా మారాయన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరత విపరీతంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారన్నారు.
అభివృద్ధి చేతగాక బీఆర్ఎస్ పై నిందలు వేయడం సిగ్గు చేటన్నారు. గతంలో రెండు సార్లు రైతు బందు ఇవ్వలేదన్నారు. రైతులకు బకాయిపడ్డ రైతు బందు, రైతు భీమాకు సంబంధించిన ప్రీమియం చెల్లించి, అడబిడ్డలకు రూ.2500, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెంచి ఇస్తానన్న పింఛన్లు వెంటనే అమలు చేసిన తరువాతనే ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేయలేరన్నారు. బకనచర్ల ప్రాజెక్టును చూపుతూ పనికిమాలిన రాజకీయం చేయడం మానుకోవాలన్నారు.