
క్షమాపణలు చెప్పిన ఎన్టీఆర్.. వీడియో రిలీజ్
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్ 2’ సినిమా ఆగస్ట్ 14న భారీ ఎత్తున విడుదలయ్యేందుకు సిద్ధమైంది.
ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రమోషన్స్ భాగంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. తారక్, హృతిక్ లతో పాటుగా త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్. నాగవంశీల స్పీచ్ లు అభిమానులను ఆకట్టుకున్నాయి.
అయితే ఈవెంట్ అయిపోయిన తర్వాత సారీ చెబుతూ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. వార్ 2′ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. సినిమాకి పని చేసిన వారందరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
హృతిక్ రోషన్, దర్శకుడు అయాన్ ముఖర్జీ, నిర్మాత ఆదిత్య చోప్రాలతో పాటుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసిన సూర్యదేవర నాగవంశీకి కూడా థ్యాంక్స్ చెప్పారు. దాదాపు పన్నెండేళ్ల తర్వాత ఓపెన్ గ్రౌండ్ లో జరిగే ఈవెంట్ కు వచ్చానని, నాగవంశీ ఫోర్స్ చేసి మరీ తీసుకొచ్చాడని తారక్ అన్నారు.
హీరోగా 25 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకోడానికి వచ్చానని చెప్పారు. ఇలా సుదీర్ఘంగా మాట్లాడి ఫ్యాన్స్ ను ఉత్సాహ పరిచారు. ఆ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంతకాలం తనను ఎవరూ ఆపలేరని ఉద్వేగంగా మాట్లాడారు.
అయితే స్టేజ్ మీద అందరి గురించి మాట్లాడిన ఎన్టీఆర్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వాన్ని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సక్సెస్ ఫుల్ గా ఈవెంట్ జరగడానికి సహాయం చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ కు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయారు. ఈ నేపథ్యంలో తారక్ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు.
”వార్ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేయడంలో సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అలాగే తెలంగాణ పోలీస్ శాఖకు నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. దీనికి ఓ వీడియోని కూడా జత చేశారు.
”ఈవెంట్ లో నేను ఓ ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. నన్ను క్షమించాలి. నా పాతిక సంవత్సరాల జర్నీని అభిమానులతో పంచుకునే ఆనందంలో ఈ తప్పిదం జరిగింది.
ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, వారి సహాయ సహకారారాలు అందించినందుకు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి, హైదరాబాద్ పోలీసులకు, యావత్ తెలంగాణ పోలీస్ డిపార్మెంట్ కి నా కృతజ్ఞతలు. శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను.
సహాయ సహకారాలు అందించడమే కాదు, అభిమానులను ఎంతో బాధ్యతగా చూసుకొని వారి ఆనందానికి కారణమయ్యారు. దానికి అందరికీ ధన్యవాదాలు” అని ఎన్టీఆర్ తన వీడియోలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ గత కొన్నేళ్లుగా ఓపెన్ గ్రౌండ్స్ లో జరిగే ఈవెంట్స్ కి హాజరవడం లేదనే సంగతి తెలిసిందే.
2013లో ‘బాద్ షా’ ఈవెంట్ లో జరిగిన తొక్కిసలాటలో ఓ అభిమాని మరణించాడు. అప్పటి నుంచి పబ్లిక్ ఫంక్షన్స్ కు తారక్ దూరంగా ఉంటూ వస్తున్నారు. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘వార్ 2’ ఈవెంట్ లో పాల్గొనడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ వేడుకకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఈవెంట్ సక్సెస్ ఫుల్ గా నిర్వహించడంలో తమవంతు సపోర్ట్ అందించిన ప్రభుత్వానికి, పోలీసులకు ఎన్టీఆర్ థ్యాంక్స్ చెప్పారు.