
కావాలనే మా ఆయనపై లైంగిక దాడి అంటూ ఆరోపణలు
శేరిలింగంపల్లి : మైనర్ బాలికపై లైంగిక దాడి చేశారంటూ మా ఆయన సత్యప్రకాష్ పై కావాలనే అసత్య ఆరోపణలు చేస్తూ.. హాస్టల్ ఖాళీ చేయించేందుకే ఇదంతా చేస్తున్నారని ఎన్ పీపీ హాస్టల్ నిర్వహకురాలు, సత్య ప్రకాష్ భార్య లక్ష్మీ ఆరోపించారు.
ఆదివారం మీడియా ముందుకు వచ్చిన ఆమె మాట్లాడుతూ.. మైనర్ బాలికపై లైంగిక దాడి చేశారని వస్తున్నవన్నీ ఆరోపణలు మాత్రమేనని అందులో ఎలాంటి వాస్తవం లేదని, బాధితురాలిగా చెబుతున్న అమ్మాయి జులై 13న వాళ్ళ నాన్నతో కలిసి వచ్చి హాస్టల్ లో జాయిన్ అయిందని, అప్పటి నుంచి వాళ్ల అమ్మానాన్న రోజు ఇక్కడికి వచ్చి పోతూ ఉంటారని,
కానీ ఆమె ఎక్కడా కాలేజీలో జాయిన్ అవలేదని, ఓ ప్రణాళిక ప్రకారమే, ఆమె మరో ఇద్దరు అమ్మాయిలు ఇదంతా చేశారని లక్ష్మీ ఆరోపించారు. వారి వెనకాల ఉండి ఓ నాయకుడు నడిపిస్తున్నారని అన్నారు.
బిల్డింగ్ ఓనర్ కు, మాకు మధ్య గత కొంతకాలంగా ఇష్యూస్ ఉన్నాయని, కేసు కోర్టులో ఉన్న నేపథ్యంలో దానిపై మేము అక్కడే ఫైట్ చేస్తున్నామని, కానీ రవి అనే అతను కావాలనే ప్రతీసారి తమపై దాడి చేస్తున్నారని, గతంలో మా అమ్మపై, ఆ తర్వాత నాపై కూడా దాడి చేశారని, మేము మాదాపూర్ పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశామన్నారు.
బిల్డింగ్ ఖాళీ చేయక పోవడంతో మా ఆయనపై నిందలు వేస్తున్నారని, మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని ఎన్ పీపీ హాస్టల్ నిర్వాహకురాలు లక్ష్మీ కన్నీటి పర్యంతం అయ్యారు.
కావాలనే రవి అనే వ్యక్తి మా దగ్గర 40 మంది వరకు అమ్మాయిలు హాస్టల్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఇక్కడికి పిలిపించి దాడి చేశారని అన్నారు. మేము గత 8 ఏళ్లుగా హాస్టల్ నిర్వహిస్తున్నామని, మా ఆయనపై ఆరోపణలు రావడం గత 8 ఏళ్లలో ఇదే మొదటిసారి అని అన్నారు.
మా ఆయనపై హత్యాయత్నం జరిగిందని మా హాస్టల్ సీసీ కెమెరాల డీవీఆర్ కూడా ఎత్తుకెళ్లారని లక్ష్మీ ఆరోపించారు. పోలీసులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఎన్ పీపీ నిర్వాహకురాలు లక్ష్మీ కోరారు.