
సెల్ఫీ తీసుకుని పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
అనారోగ్యంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరణానికి ముందు సెల్ఫీ వీడియో తీసుకుని తన బాధను వ్యక్తపరిచాడు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బూడిదపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
అనారోగ్యంతో మనస్తాపం సైదాపూర్ మండలం బూడిదపల్లి గ్రామానికి చెందిన అమరగొండ రాహుల్ (20) గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు.
వైద్య పరీక్షలు చేయించుకోగా, అతనికి కామెర్లు ఉన్నట్లు తేలింది. అయితే, తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడంతో రాహుల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
దీంతో శుక్రవారం సాయంత్రం గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. ఈ సమయంలో అతను తన స్నేహితులకు పంపించడానికి ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
వైరల్ అయిన సెల్ఫీ వీడియో : రాహుల్ పురుగుల మందు తాగుతూ తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో రాహుల్ మాట్లాడుతూ, “సంతోషంగా చనిపోతున్నా. నా చావుకు ఎవరూ కారణం కాదు. మా అమ్మానాన్న తిట్టినందుకు నేను చనిపోవడం లేదు. అందరికీ బాయ్, మిస్ యూ ఆల్” అని చెప్పాడు.
రాహుల్ సెల్ఫీ వీడియోను చూసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు వెంటనే అతడిని హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ పరిస్థితి విషమించడంతో, మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం రాహుల్ మరణించాడు.
రాహుల్ తల్లి విజయ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యకు ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడం విషాదకరమని స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. యువత తమ జీవితంలో ఎదురయ్యే చిన్నపాటి సమస్యలకే నిరాశ చెందకుండా ధైర్యంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎటువంటి సమస్య వచ్చినా, మానసిక నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకోవాలని వారు కోరారు.