
కోట శ్రీనివాసరావు ఇంట్లో మరో విషాదం.. సతీమణి కన్నుమూత!
దివంగత నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య రుక్మిణి కన్నుమూశారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం (ఆగస్టు 18న) తుదిశ్వాస విడిచారు. కాగా కోట శ్రీనివాసరావు నెల రోజుల క్రితమే పరమపదించారు.
వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో జూలై 13న కన్నుమూశారు. ఆయన మరణించిన నెల రోజులకే భార్య మరణించడం విషాదకరం! కోట రుక్మిణి మృతిపై పలువురు సెలబ్రిటీలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
విలక్షణ నటుడు : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా కోట శ్రీనివాసరావు తనదైన ముద్ర వేశారు.
విలన్‌గా, తండ్రిగా, కామెడీ విలన్‌గా, రాజకీయ నాయకుడిగా విభిన్న పాత్రలో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో రంగప్రవేశం చేసిన కోట.. అన్నిరకాల పాత్రలు పోషించి తెలుగు తెరపై ఆల్‌రౌండర్‌గా నిలిచారు.