
కేజీబీవీ ప్రిన్సిపాల్ ఆత్మహత్యాయత్నం
కొద్ది రోజుల నుంచి వార్తల్లో నిలిచిన పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ రేజేటి సౌమ్య సోమవారం ఆత్మహత్యాయత్నం చేసు కున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. శ్రీకాకుళం నగరంలో తిలక్‌నగర్‌లో నివసిస్తున్న ఆమె సోమవారం ఉదయం ఓ సోషల్‌మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు.
అదే సమయంలో ఇంటిలో సౌమ్య పడిపోవడంతో ఆమెను కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డా.శిరీష..
సౌమ్యను అత్యవసర చికిత్స విభాగంలో చేర్పించారు. మధ్యాహ్నానికి ఆమె పరిస్థితి కాస్త మెరుగుపడింది. అక్కడే తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ.. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆరోపణలు చేశారని..
తనపై వస్తున్న నెగిటివ్ ట్రోల్స్ తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిపారు. తనను టార్గెట్ చేసి వేధిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు.
ఆసుపత్రి ప్రాంగణంలోనే ఆమె కుమారుడు రాహుల్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పలువురు స్టూడెంట్లకు అడ్మిషన్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, అయితే అప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ ముగియడంతో నిబంధనలకు విరుద్ధంగా తన తల్లి అంగీకరించలేదన్నారు.
పొందూరు నుంచి కంచిలి మండలానికి బదిలీ చేశారని.. చాలా వేధింపులకు గురిచేయడంతో తన తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.