ఓటు అనే ఆయుధంతో కల్వకుంట్ల కుటుంబాన్ని తరమాలి
బి ఆర్ ఎస్ పార్టీ దొంగల పార్టీ
ప్రభుత్వం వచ్చిన వెంటనే బోడు, కొమరారం మండలాలు ఏర్పాటు చేస్తాం
సింగరేణి కార్మికుల ఇన్కమ్ టాక్స్, పెన్షన్ ఇష్యులను పరిష్కరిస్తాం
6 గ్యారంటీలు పక్కగా అమలు
ఇందిరమ్మ ఇల్లులు కట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే
కాంగ్రెస్ వస్తే రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ
68 నుండి 72 అసెంబ్లీ స్థానాలతో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ
ఇల్లందులో కనకయ్య అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం
ఇల్లందు: తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటు అనే ఆయుధంతో కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ కొ చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు . సోమవారం ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక జగదాంబ సెంటర్ లో జరిగిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ దొంగల పార్టీ అని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కెసిఆర్ కలలు కంటున్నారని, అవి కలలుగానే మిగిలిపోతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం దొరల చేతిలో బందీగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిరుల తల్లి సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటికరణ చేసేందుకు కుట్రలు పన్నుతుందని తెలిపారు. కార్మిక పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో సైతం ప్రభుత్వం పూర్తిగా వివక్షత చూపిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు పరిశ్రమ బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు నీటితో ఇల్లందు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక అమలు చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు 68-72 సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెల్ల కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సన్న బియ్యంతో పాటు, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇల్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. బోడు, కొమరారం మండలాల్లో ఏర్పాటు బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వనీదేనని తెలిపారు. రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని విచ్చలవిడిగా డబ్బులను పంపిణీ చేయడం జరుగుతుందని, ఆ డబ్బులు మనవేనని గుర్తు చేశారు. ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ అబద్ధాలు చెప్పి కెసిఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది దొరలు దోచుకోవడానికి కాదని, అన్ని వర్గాలు మతాలు, కులాలు, సుఖసంతోషాలతో ఉండాలంటే సెక్యులర్ పార్టీ అయినా కాంగ్రెస్ రావాలన్నారు . రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబానికి రూ. లక్ష కోట్ల సంపాదన ఎక్కడిదని ప్రశ్నించారు. ఇల్లందు అంటే బొగ్గు బంగారమని, 100 సంవత్సరాలకు పైగా ఇల్లందుకు చరిత్ర ఉందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు, త్వరలో కేంద్రంలో సైతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరుగుతుందని, సింగరేణి సంస్థ ప్రైవేటీకరణను రద్దు చేస్తామని తెలిపారు. సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్, పెన్షన్ సమస్యలను సైతం పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో 13 లక్షల అర్హులైన పోడు వ్యవసాయదారులు దరఖాస్తులు చేసుకోగా, ప్రభుత్వం కేవలం 4 లక్షల పోడు భూములకు పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి పోడు భూములు పట్టాలు ఇస్తామని స్పష్టం చేశారు. డిసెంబర్ 3న రాష్ట్రంలో అద్భుత ఫలితాలు రావడం ఖాయమని, 9న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేస్తారన్నారు. రాష్ట్రం ఏర్పాటు అయ్యాక మొదటి క్యాబినెట్ సమావేశంలోనే 6 గ్యారెంటీలను అమలు చేసి వంద రోజుల్లో ప్రతి లబ్ధిదారులు ఇంటికి చేర్చడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు ఒకటో తేదీన రూ. 2500 జమ చేయడం జరుగుతుందని, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో రైతన్నలకు ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రైతులు, కౌలు రైతులకు ప్రతి ఎకరానికి రూ. 15వేలు ఇస్తూ రైతు భరోసా కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. భూమిలేని నిరుపేదలకు రూ. 12వేలు ఇస్తామని తెలిపారు. చదువుకున్న నిరుద్యోగులకు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఉన్నత చదువులు, కోచింగ్ ల కొరకు రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు క్రెడిట్ కార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసరా పింఛన్ రూ. 2వేలకు బదులు రూ. 4వేలు ఇస్తామని స్పష్టం చేశారు. పేదలకు జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షలు కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి పేద ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రూ. లక్షతోపాటు తులం బంగారం ఉచితంగా ఇవ్వడం ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇల్లు స్థలాలు లేని పేదలకు ఉన్న స్థలాలతో పాటు ఎస్టిలకు రూ. 6 లక్షలు, ఇతర కులాల వారికి రూ. 5 లక్షల రూపాయలను ఇస్తామన్నారు. ఇల్లందు నియోజకవర్గ ప్రజలు ఆలోచించి చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి పోరం కనకయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఇల్లందు నియోజకవర్గ అభ్యర్థి కోరం కనకయ్య, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మువ్వా విజయ్ బాబు, రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, రామ్ రెడ్డి చరణ్ రెడ్డి, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.