
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావుకు చుక్కెదురు… స్టే ఇవ్వలేమన్న ధర్మాసనం
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌పై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
అందులో భాగంగా శుక్రవారం కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్లపై వాదనలు ముగిశాయి.
మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదన్న హైకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక.. పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే.. దానిని వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
అయితే పిటిషనర్లు కోరిన విధంగా స్టే మాత్రం ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావుకు హైకోర్టులో నిరాశ ఎదురైనట్లు అయింది.
కోర్టులో ఈ రోజు వాదనలు ఇలా..
పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు అడ్వకేట్ జనరల్ (ఏజీ) శుక్రవారం తెలియజేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అందిన నివేదకను అసెంబ్లీలో ప్రవేశపెడతామని కోర్టుకు స్పష్టం చేశారు.
అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అంటే.. ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కోర్టుకు ఏజీ వివరించారు.
అంతలో హరీష్ రావు తరఫు న్యాయవాది సుందరం తన వాదనలు వినిపిస్తూ.. మొత్తం కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని కోరారు.
ఈ నివేదికను అడ్డం పెట్టుకుని తమ పిటిషనర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో తమ వారిపై ఎలాంటి చర్యలు తీసుకో వద్దని కోరుతున్నామని కోర్టు దృష్టికి న్యాయవాది సుందరం తీసుకు వెళ్లారు.
అంతేకాకుండా.. జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను అసెంబ్లీలో కంటే.. ముందే మీడియాకు ఇచ్చి.. తమ పిటిషనర్ల పరువుకు భంగం కలిగించారని కోర్టుకు న్యాయవాది సుందరం తెలిపారు. తమకు 8B, 8C కింద నోటీసు ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు.
దీంతో హైకోర్టు న్యాయమూర్తలు జోక్యం చేసుకుని.. 8B నోటీస్ కాకుండా సెక్షన్ 5(1) ఎందుకు ఇచ్చారంటూ ప్రభుత్వ తరఫు నాయ్యవాది ఏజీని సూటిగా ప్రశ్నించారు. తాము ఇచ్చిన నోటీస్ 8B లాంటి నోటీసని కోర్టుకు ఏజీ తెలిపారు. హరీష్ రావు, కేసీఆర్ అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారని ఈ సందర్భంగా కోర్టుకు గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఈ నివేదిక పెట్టిన తర్వాతే చర్యలు తీసుకుంటామన్న ఏజీ వెల్లడించారు. ఆ క్రమంలో ఈ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఆరు నెలలు సమయం ఉంటుందని కోర్టుకు ఏజీ వివరించారు.