
పాముకాటుతో కుమార్తె మృతి.. తల్లి పరిస్థితి విషమం
ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లు పాముకాటుకు గురి అయిన సంఘటన సత్తుపల్లి మండలం చిన్న పాకల గూడెం గ్రామంలో గురువారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చోటుచేసుకుంది.
బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సత్తుపల్లి మండలం పాకాల గూడెం గ్రామానికి చెందిన గౌర గోపి, మౌనిక దంపతులు తమ పిల్లలతో కలిసి ఇంట్లో నేలపైన నిద్రిస్తున్నారు.
ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించిన కట్ల పాము (విష సర్పం) తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్న కుమార్తె లోహిత (5)ను, తల్లి మౌనికను కాటు వేసింది.
దీంతో కుటుంబ సభ్యులు లేచి పామును గుర్తించి చంపి వైద్య సేవల నిమిత్తం గౌర లోహిత( 5)ను, తల్లి మౌనికను108 లో సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లోహిత (5) మృతి చెందింది.
తల్లి మౌనిక పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సేవల నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. లోహిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో భద్రపరిచారు. పాముకాటుతో చిన్నారి లోహిత మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.