
ఆర్టీసీ బస్సు దగ్ధం.. తప్పిన ప్రమాదం
విశాఖలో పెను ప్రమాదం తప్పింది. 130 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగసి పడ్డాయి.
బస్సు వెనుక వస్తున్న ఆటో డ్రైవర్ మంటలను గమనించి వేగంగా వెళ్లి బస్సు డ్రైవర్‌ను అలర్ట్ చేశాడు. దాంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సును పక్కకు ఆపి ప్రయాణికులందరినీ బస్సులోనుంచి దింపేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని 3 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.
శుక్రవారం ఉదయం కూర్మన్నపాలెం నుంచి బయలుదేరిన బస్సులో ఈ ప్రమాదం జరిగింది. అక్కయ్యపాలెం శాంతిపురం హైవే వద్ద బస్సును నిలిపేశారు. మంటలు చెలరేగుతున్న సమయంలో భారీ శబ్దంతో బస్సు టైర్లు పేలిపోయాయి.
హైవేలో ఒకవైపు ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేసి.. మంటలను ఆర్పివేశారు. బస్సు నిలిపిన ప్రదేశంలో పక్కనే పెట్రోలు బంకు ఉండటంతో మంటలు అటుగా వ్యాపిస్తాయేమోనని తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పోలీసులు అప్రమత్తమై పెట్రోల్ బంకులో పెట్రోల్ ఆపరేషన్స్ నిలిపివేయాలని సూచించారు. సిబ్బందిని ఖాళీ చేయించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అతి కష్టం మీద అదుపు చేశారు.
మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పారు ఫైర్ సిబ్బంది. ప్రయాణికులంతా దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. మంటలు భారీగా చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది.