
మళ్లీ అసెంబ్లీకి రాను.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూటే సపరేట్. గత కొంత కాలంగా సొంత పార్టీ, ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆయన.. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీకి రానని సెన్సేషనల్ కామెంట్ చేశారు.
ఇవాళ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తన మద్దతు దారులతో గన్ పార్క్ వద్దకు చేరుకున్న రాజగోపాల్ రెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడారు. రోజు అసెంబ్లీ తర్వాత మళ్లీ అసెంబ్లీకీ రానని చెప్పారు.
ప్రజలు వరద కష్టాల్లో ఉన్నారని వారికి అండగా ఉండాల్సిన సమయం ఇది అన్నారు. కామారెడ్డి ప్రాంతంలో వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తన అనుచరులతో పాటు ఆ ప్రాంతంలో ప్రాంతాల్లో పర్యటించి వారికి అండగా ఉంటానన్నారు.
అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ ఏర్పాటు అయిందని అమరవీరుల స్థూపం అంటే తమకు గుడితో సమానం అన్నారు. అమరవీరుల స్తూపం వద్దకు రావడానికి ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదన్నారు.
అయితే గత కొంత కాలంగా సొంత ప్రభుత్వాన్ని, పార్టీని టార్గెట్ చేస్తున్న ఆయన ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు తన అనుచరులతో కలిసి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాశం అవుతున్నది.
తనకు మంత్రి పదవి హామీ ఇచ్చి మోసం చేశారని తొలుత ఆవేదన వ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత మునుగోడు నియోజకవర్గానికి నిధులు ఇవ్వట్లేదని బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.
ఇక నిన్నే రీజనల్ రింగ్ రోడ్డు రైతుల పక్షాన తాను నిలబడతానని భరోసా ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా నేను ప్రజల పక్షమేనని చెబుతున్న రాజగోపాల్ రెడ్డి..
ఓ వైపు సభలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో నిర్మించిన కాళేశ్వరం రిపోర్టుపై ప్రత్యేక సెషన్ నిర్వహిస్తుంటే ఈ సమావేశాలకు తాను హాజరుకావడం లేదని చెప్పడం కొత్త చర్చకు దారి తీస్తోంది. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజా రాజకీయ వ్యూహం ఏంటన్నది అంతుచిక్కడం లేదు.