
అనుమతుల పేరుతో వేధింపులు తగదు…
- ఎన్‌వోసీల జారీలో అలసత్వంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం…
- ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అనుమతులు ఇవ్వాలని ఆదేశం
హైదరాబాద్: బహుళ అంతస్తుల భవనాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి అనుమతుల జారీ విషయంలో జాప్యంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో బిల్డ్ నౌ కింద పనుల అనుమతుల విషయంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం సమీక్షించారు.
బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం, ఇతర అనుమతుల విషయంలో ఉద్దేశపూర్వకంగా కొందరు అధికారులు అలసత్వం చూపుతున్నారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
అనుమతుల జాప్యంలో ఆలస్యానికి కారకులను గుర్తించి వారిని సరెండర్ చేయాలని హెచ్ఎండీఏ కార్యదర్శి ఇలంబర్తిని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా నీటి పారుదల శాఖ విభాగం అధికారులపై పలు ఆరోపణలు వస్తున్నాయని… వాటిని ఎంతమాత్రం సహించేది లేదని సీఎం హెచ్చరించారు.
హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు, నాలాల, ఇతర నీటి వనరులకు సంబంధించి లైడార్ సర్వేను తక్షణమే చేపట్టాలని సీఎం ఆదేశించారు. సమగ్రమైన వివరాలున్నప్పుడు మాత్రమే ఎటువంటి వివాదాలకు తావుండదని సీఎం అన్నారు.
ఈ విషయంలో జీహెచ్ఎంసీ, హైడ్రా, ఇరిగేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ త్వరగా అనుమతులు మంజూరు చేయాలని సీఎం హెచ్ఎండీఏ సెక్రటరీని ఆదేశించారు. సమీక్షలో హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.