
యూరియా, ఎరువులు పంట సాగుకు అనుగుణంగా పంపిణీ చేయాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
సెప్టెంబర్ 3, ( సీ కే న్యూస్)
జిల్లాలో కొనసాగుతున్న వ్యవసాయ సాగుకు అనుగుణంగా సకాలంలో యూరియా, ఎరువులు కార్యచరణ ప్రకారం పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భుక్యా ఛాత్రు తో కలిసి మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో యూరియా, ఎరువుల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యూరియా, ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, వ్యవసాయ సాగుకు అనుగుణంగా సకాలంలో కార్యచరణ ప్రకారం రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ఫర్టిలైజర్ దుకాణాలలో యూరియా, ఎరువుల నిల్వలు పరిశీలించి దుకాణ యజమానులు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ – పాస్ మిషన్లలో నమోదు చేయబడిన వివరాలు, సంబంధిత ఫర్టిలైజర్ దుకాణాలలో నిల్వ ఉన్న ఎరువుల వివరాలలో ఎలాంటి విభేదాలు ఉండకూడదని తెలిపారు. యూరియా పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఫర్టిలైజర్ దుకాణాల నుండి అధిక మొత్తంలో కొనుగోలు చేసే వారి వివరాలు పరిశీలించాలని, కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రసీదు జారీ చేసి వివరాలు రిజిస్టర్ లో నమోదు చేయాలని, ఫర్టిలైజర్ దుకాణంలో ధరల వివరాలు, నిల్వ ఉన్న ఎరువుల వివరాలు ప్రదర్శించాలని తెలిపారు. పంట సాగు చేస్తున్న రైతులు, సాగు చేయని రైతుల వివరాలు సేకరించి నివేదిక అందించాలని తెలిపారు. కాలానికి అనుగుణంగా సాగు చేయవలసిన పంటల వివరాలు, సాగు మెలకువలను రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పంట సాగు విస్తీర్ణం, యూరియా, ఎరువుల పంపిణీ, పంట సాగు చేసే రైతుల వివరాలు తదితర అన్ని అంశాలు అనుసంధానమై ఉంటాయని, నివేదిక స్పష్టంగా ఉన్నట్లయితే వరి ధాన్యం, పత్తి, ఇతర పంటల దిగుబడి, కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది




