
లంచం తీసుకుంటూ పట్టుబడిన నార్సింగి టౌన్ ప్లానింగ్ అధికారిణి
నార్సింగి ఘటనపై సీఎం సీరియస్..
నార్సింగి మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ అధికారిణి మణిహారిక ఏసీబీకి చిక్కారు. మంచిరేవులలో ఉన్న ఒక ప్లాట్‌కు సంబంధించిన లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్) క్లియర్ చేసేందుకు ఆమె రూ.10 లక్షల లంచం డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. నార్సింగి మున్సిపాలిటీలో రూ.4లక్షలు తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.
ఈ ఘటనలో ఎవరెవరు ఉన్నారనే అంశంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ కూడా సీఎం పరిధిలోనే ఉండడంతో ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.
కమిషనర్ ను విధుల్లోంచి తప్పించాలని ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. అయితే టౌన్ ప్లానింగ్ అధికారిపై ఏసీబీ అధికారులు రెండ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తరుణంలో కమిషనర్ టెన్షన్ తో పరుగులు తీశారని బాధితులు చెబుతున్నారు.
అయితే టౌన్ ప్లానింగ్ అధికారి 4నెలలుగా చేసిన కార్యక్రమాలపై ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆమె ఇంటి వద్ద కూడా తనిఖీలు చేస్తున్నారు. ఈ ఘనటలో ఎవరెవరి పాత్ర ఉందనే అంశంపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది.
తీవ్ర ఆరోపణులు… నార్సింగ్ మున్సిపాలిటీలోని గండిపేట, వట్టినాగులపల్లి, జన్వాడ ప్రాంతాలన్ని జీఓనెం.111 పరిధిలో ఉన్న అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.
ముఖ్యంగా గండిపేట చెరువు బఫర్ జోన్ పరిధిలోనే వెలుస్తున్న కన్వెక్షన్లపై అధికారులు చర్యలు తీసుకోవడంలేదని, దీనిపై ఇప్పటికే ఫోర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు ప్రజాభవన్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అయితే స్థానికులను సైతం చాలా ఇబ్బందులు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
జీహెచ్ఎంసీ చుట్టు ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలపై ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా నిఘా పెట్టినట్టు సమాచారం. 27 మున్సిపాలిటీల్లోనే నిర్మాణాలు ఎక్కువగా జరుగుతుండడంతో మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులపై నిఘా పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది.