
తెలంగాణలో పిడుగుపాటుకు 9 మంది మృతి…
తెలంగాణలో విషాదం నెలకొంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు ఇవాళ (సెప్టెంబర్ 10న)ఒకే రోజు వేర్వేరు చోట్ల పిడుగులు పడి 9 మంది చనిపోయారు. నిర్మల్ జిల్లాలో ముగ్గురు, జోగులాంబ గద్వాల జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. ఈ క్రమంలో అనేక ప్రాంతాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడటంతో నిన్న ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
అందులో గద్వాల జిల్లా అయిజ మండలం భూంపూర్ గ్రామంలో పిడుగుపాటుకు సర్వేసు(24), పార్వతి(34), సౌభాగ్య(36) అనే ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు.
అలాగే నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మెన ఎంగ్లాపూర్ గ్రామంలో పొలంలో కలుపు తీస్తున్న ఆలకుంట ఎల్లయ్య(37), భార్య లక్ష్మీ (32), మేనమామ బండారి వెంకన్న(50) అనే ముగ్గురు రైతులను పిడుగుపాటు బలి తీసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం చీమ గూడెం గ్రామంలో పిడుగు పడటంతో పాయం నర్సయ్య(50) అనే రైతు ప్రాణాలు కోల్పోయాడు.
అలాగే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలో బర్లు చేసేందుకు వెళ్లిన మహేష్(32), మధిర సమీపంలోని మడిపల్లి గ్రామానికి చెందిన గడిపూడి వీరభద్ర రావు(50) అనే రైతు పిడుగుపాటు కారణంగా మృతి చెందారు. ఉహించని విధంగా పిడుగుల వర్షం పడి 9 మంది ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదిలా ఉంటే ఈ రోజు తెలంగాణలోని 5 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.