
మాజీమంత్రి ఎర్రబెల్లి అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత!
రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులు యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు.
క్యూలైన్లలో చెప్పులు పెట్టి పడిగాపులు పడుతూ యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో అయితే రాత్రివేళల్లోనే ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద పడుకుంటున్నారు. యూరియా కోసం నానా అవస్థలు పడుతున్నారు.
రైతుల కోసం బీఆర్ఎస్ ఆందోళన : రైతులు ఇంతగా ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తుందని, రైతుల పక్షాన బి ఆర్ ఎస్ పార్టీ ఆందోళనలు మొదలు పెట్టింది. ప్రభుత్వం తక్షణం రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేస్తుంది.
గత ప్రభుత్వ హయాంలో బఫర్ స్టాక్ పెట్టి, రైతులకు ఇబ్బంది లేకుండా చేశామని, ప్రస్తుత ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వకుండా, ఎలాంటి ముందు చూపు లేకుండా ప్రవర్తించి రైతులకు నష్టం చేస్తుందని మండిపడుతోంది. ధర్నాలో మాజీమంత్రి ఎర్రబెల్లి.. ట్రాఫిక్ కి ఇబ్బంది
రైతుల ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతుల యూరియా సమస్యను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోడ్డుపైన బైఠాయించి ఆందోళన నిర్వహించారు.
ఈ ఆందోళనలో రైతులు, బి ఆర్ ఎస్ ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ప్రధాన రహదారి మీద బైఠాయించి ఆందోళన చేయడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు ఎర్రబెల్లి దయాకర్ రావు ను అరెస్ట్ చేశారు.
రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట.. ఎర్రబెల్లి అరెస్ట్ తో ఉద్రిక్తత : ఈ క్రమంలో రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఎర్రబెల్లి దయాకర్ రావును రాయపర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మరోవైపు రైతులు తమకు యూరియా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. తమ సమస్య పరిష్కరించాలని, పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.