
దానం, కడియం మినహా అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే !
Social media viral : పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది తాము భారత రాష్ట్ర సమితిలోనే ఉన్నామని .. పార్టీ మారలేదని స్పీకర్ కు సమాధానం ఇచ్చారు. ఆ సమాధానాలను స్పీకర్ కార్యాలయం బీఆర్ఎస్ పార్టీకి పంపింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం తమకు మరింత సమయం కావాలని అడిగారు.
వీరిద్దరూ తాము ఉపఎన్నికలకు అయినా సిద్ధం కానీ బీఆర్ఎస్ లో ఉన్నట్లుగా చెప్పుకోవడానికి సిద్ధపడటం లేదు. దానం నాగేందర్ కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేయగా..కడియం శ్రీహరి కుమార్తె ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు.
గత ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి వీరందరితో సమావేశం అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, న్యాయనిపుణులు సూచనలు అన్నింటిపై చర్చించారు.
చివరికి వారంతా.. టెక్నికల్ అంశాలనే నమ్ముకోవాలని డిసైడయ్యారు. అందులో భాగంగా.. తాము పార్టీ మారలేదని బీఆర్ఎస్లోనే ఉన్నామని సమాధానం ఇచ్చారు.
సీఎం ను కలవడం అంటే పార్టీ మారినట్లుగా కాదని అంటున్నారు. ఇప్పుడు వారు పార్టీ మారినట్లుగా బీఆర్ఎస్ ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. చట్టం ప్రకారం స్వచ్చందంగా పార్టీకి రాజీనామా చేసినా.. విప్ ధిక్కరించినా అనర్హతా వేటు పడుతుంది.
టెక్నికల్ టెర్మ్స్ ప్రకారం వారెవరూ పార్టీ మారలేదు. దానం నాగేందర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు కాబట్టి ఆయన పార్టీ మారినట్లుగా ఆధారాలు ఉంటాయి. కడియం కూడా తాను పార్టీ మారలేదని చెప్పుకోవడానికి అవకాశం ఉంది.
కానీ దానికి ఆయన సిద్ధంగా లేరు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే.. ఈ ఎనిమిది మందిపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హతా పిటిషన్లను స్పీకర్ తిరస్కరించడం ఖాయం. మరి ఇద్దరి సంగతిని ఏం చేస్తారో ?