
మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటుపరం చేస్తే ప్రతిఘటన తప్పదు.
పనిభద్రత, కనీస వేతనాలకోసం సమిష్టిగా పోరాడుదాం.
వేతనపెంపు హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి.
మధ్యాహ్న భోజన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.
ఉత్సాహంగా మిడ్డే మీల్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా 3వ మహాసభ.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
సెప్టెంబర్ 13,
కొత్తగూడెం : మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ప్రతిఘటన ఉద్యమాలు తప్పవని ఏఐటీయూసీ అనుబంధ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా హెచ్చరించారు.
యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 3వ మహాసభ సిపిఐ జిల్లా కార్యాలయం ‘శేషగిరిభవన్’లో శనివారం జరిగింది. మహాసభకు ముఖ్య అతిధులుగా హాజరైన నాయకులు మాట్లాడుతూ పేద విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రారంభించిన మధ్యాహ్నభోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే లక్ష్యం నెరవేరదనే ఉద్దేశంతో గౌరవ సుప్రీం కోర్టు ప్రైవేటుకు నిరాకరిస్తూ గైడ్లైన్స్ విడుదల చేసిందని దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా పాటించి సెంట్రలైజ్డ్ కిచెన్ విధాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
మధ్యాహ్న కార్మికులకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లు కావస్తున్నా ఆ హామీని అమలుచేయకుండా కార్మికులను మోసం చేస్తోందని, వేతన పెంపు హామీని నిలబెట్టుకొని తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.
ఈ పథకం లక్ష్యం నెరవేరాలంటే స్లాబ్ రేటు రూ.25లకు నిర్ణయించి విడుదల చేయాలని, సాధ్యంకాని పక్షంలో నిత్యావసరాలు, కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పనిభద్రత కల్పించేందుకు గుర్తింపు కార్డులతోపాటు, తహసీల్దార్ల ద్వారా ప్రొసీడింగ్ అర్దార్లు ఇచ్చి డ్రస్ కోడ్ అమలు చేయాలని కోరారు. ఏ సంస్థలో లేని విధంగా ప్రభుత్వం ఏడాదికి 10 నెలల వేతనం మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుంటోందని, ఏది సరైంది కాదని, తొమ్మిది, పదో తరగతి విద్యార్థులను పరిగణ లోకి తీసుకొని పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కంచర్ల జమలయ్య, నరాటి ప్రసాద్ మాట్లాడుతూ వంట కార్మికులను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ప్రమాద భీమా, టర్మినల్ బెనిఫిట్ అమలు చేయాలని కార్మికులు, కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్ న్యాయమైందని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
కార్మికుల పక్షాన నిలబడి వారి హక్కుల సాధన, పరిరక్షణకోసం నిలబడి పోరాడేది ఏఐటీయూసీనేనని, ఏఐటీయూసీ పక్షాన చేరి కార్మికోధమాలకు మరింత బలాన్ని అందించాలని పిలుపునిచ్చారు.
మహాసభలో మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి, వేర్పుల మల్లికార్జున్, నిమ్మటూరి రామకృష్ణ, సత్తెనపల్లి విజయలక్ష్మి, దాసుల పుష్పవతి, ఎన్ ప్రభావతి, పైడిపల్లి లక్ష్మి, షహీన్, మంగ, నర్సమ్మ, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.