
దమ్ముంటే జూబ్లీహిల్స్‌లో గెలిచి చూపించు.. కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్…
నేటి పేదోడి ప్రభుత్వం సంక్షేమ పథకాలు తెస్తుంటే.. కొంతమంది విషం కక్కుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.
పాముకు కోరల్లో విషం ఉంటే, కొందరి నాయకులకు ఒళ్ళంతా విషం ఉంటుందని విమర్శించారు. ఎదులాపురం మున్సిపాలిటీ వరంగల్ క్రాస్ రోడ్డులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వేదిక మీద నుంచి నాటి ప్రబుద్ధులను అడుగుతున్న.. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే మీకు కడుపు మంట ఎందుకని ఆయన ప్రశ్నించారు. పెదోడికి ఇల్లు కట్టించి ఉంటే మీకు ఈ పరిస్థితి ఉండేది కాదని హితవు పలికారు.
బీఆర్ఎస్‌కు మరోసారి ప్రజలు బుద్ధి చెప్తారు.. బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు రెండు పర్యాయాలు బుద్ధి చెప్పారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.
వారి సోదరి, బిడ్డ సమస్యను సీఎం రేవంత్ రెడ్డికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మూడున్నర సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల గురించి ట్విట్టర్ టిల్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
‘మీ పార్టీ శాసన సభ్యులు ఆరోగ్యం బాగాలేక చనిపోయారు. దానికి 15 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. మీకు ఉన్న పరిజ్ఞానం, విజన్ గురించి నేను మాట్లాడను.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలిచి చూపించు’ అని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
నువ్వెంత బచ్చా గాడివి…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ మీద బచ్చా గాడిని పెట్టి గెలిపిస్తామని మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడున్నర సంవత్సరాల తర్వాత కేటీఆర్ ఇండియాలో ఉంటారో.. బ్యాగ్ సర్దుకుని విదేశాలకు వెళ్తారో చూడాలని ఎద్దేవా చేశారు.
జూబ్లిహిల్స్ ఎన్నిక తర్వాత మీ పార్టీ స్థానం ఏంటో చూడు నాయన ట్విట్టర్ టిల్లు కేటీఆర్ అంటూ.. విమర్శించారు. మీ దయ దాక్షిణ్యాలతో ఎవరు బి ఫామ్ తీసుకోలేదని పేర్కొన్నారు. మీ నాయన మూడు సార్లు వచ్చి ముక్కు నేలకు రాసిన ఏమి చేయలేక పోయారని, నువ్వెంత బచ్చా గాడివి అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఆషామాషీ పార్టీ కాదన్నారు.
ఇచ్చిన మాట కోసం నిలబడి, నెరవేర్చే పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. ఈ పార్టీలో ఏ ఒక్కరు తప్పు చేయరని ఉద్ఘాటించారు. తల కిందులగా తపస్సు చేసిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయో.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అవే సీట్లు వస్తాయని మంత్రి పొంగులేటి ధ్వజమెత్తారు.
కేటీఆర్ కామెంట్స్.. తంతే.. గారెలబుట్టలో పడినట్టు లక్కీలాటరీలో మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మళ్లీ పాలేరులో ఎలా గెలుస్తారో చూద్దామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం తెలంగాణభవన్‌లో భద్రాచలం నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల భేటీలో పొంగులేటిపై కామెంట్స్ చేశారు. ఏడాది క్రితం పొంగులేటి ఇంటిపై జరిగిన ఈడీ దాడుల్లో దొరికిన డబ్బు గురించి కేంద్రంగానీ, ఆయనగానీ ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు.
‘పొంగులేటి బీజేపీతో కుమ్మక్కయ్యారా? బీజేపీతో కుమ్మక్కైన రేవంత్‌రెడ్డితో పొంగులేటి కలిసిపోయారా..?’ అని నిలదీశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ మాటలకు ఇవాళ(గురువారం) మంత్రి పొంగులేటి బదులిచ్చారు.