
వైద్యం వికటించి చిన్నారి మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన
వైద్యం వికటించి చిన్నారి మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుప్పల్ 13వ డివిజన్, దేవేందర్ నగర్ ఫేస్ 2 లో జరిగింది.
బంధువులు తెలిపిన వివరాల ప్రకారం .. పెయింటింగ్ పని చేసుకునే కొండ రాజు, భార్య లావణ్య ఇద్దరు పిల్లలతో సరూర్ నగర్లో నివాసం ఉంటున్నారు.
పెద్ద పాప హాసిని(6) డెంగీ పాజిటివ్, పసిరికలు ఎక్కువ ఉండటంతో వారికి తెలిసిన వారు బోడుప్పల్ దేవేందర్ నగర్ ఫేస్ 2 లో వైద్యుడు బాల సిద్ధులు బాగా చూస్తాడని చెప్పడంతో ఆదివారం అతని వద్దకు వైద్యం కోసం పాపని తీసుకువెళ్లారు.
ఈ క్రమంలో డెంగీ, పసిరికలు తగ్గిస్తానని చెప్పి వైద్యం అందిస్తుండగా గంటలోపే పాప మృతి చెందింది. దీంతో సత్య పాలి క్లినిక్ వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుని నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందని ఆరోపిస్తున్నారు.
ఆలోపతి వైద్యులు చేయవలసిన వైద్యం కొందరు డబ్బే ధ్యేయంగా తెలిసి తెలియని వైద్యం అందించడంతోనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని ఇలాంటి వారు అనేక ప్రాంతాల్లో ఉన్నారని ఆరోపించారు. అర్హతలు లేకుండా వైద్యం అందించే వారిపై జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.




