
సూర్యాపేటలో హైటెన్షన్.. పోలీసులను పరిగెత్తించి కొట్టిన కార్మికులు!
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక కార్మికుడు గాయపడుతూ మృతిచెందడంతో, అదే ప్రాంతంలో పని చేస్తున్న బిహార్ కార్మికులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.
ఫ్యాక్టరీలో పనిచేస్తున్న బీహార్ కార్మికుడు నిన్న డ్యూటీలో గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో సహచర కార్మికుల్లో తీవ్ర ఆగ్రహం ఉద్భవించింది.
మృతుడికి న్యాయం చేయాలని, కుటుంబానికి తగిన పరిహారం అందించాలని కోరుతూ వారు ఫ్యాక్టరీ ముందు నిరసనకు దిగారు.
ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో బీహార్ కార్మికులు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అందోళనను చెదరగొట్టేందుకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, పోలీసులతో కార్మికుల వాగ్వాదం ఘర్షణ స్థాయికి చేరింది.
పోలీసులు వారిని వెనక్కు నెట్టడానికి ప్రయత్నించగా, కార్మికులు ఆగ్రహంతో కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడగా, కొంతమంది కార్మికులు కూడా గాయపడ్డారు. ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమాచారం అందుకుని అదనపు బలగాలను అక్కడికి పంపించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి, మృతుడి కుటుంబానికి సరైన న్యాయం కల్పించేందుకు చర్చలు జరిపే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
కార్మికులు మాత్రం కంపెనీ బాధ్యత వహించాలని, భద్రతా ప్రమాణాలు పాటించాలని పట్టుబడుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ, కార్మికుల అసంతృప్తి కొనసాగుతుండడంతో భవిష్యత్తులో మరిన్ని ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




