
విచారణ కోసం పిలిచి కొట్టారు
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో ఘటన
ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలి.. విలేకరుల సమావేశంలో గిరిజన యువకుడి రోదన
యూరియా ధర్నాలో ఎందుకు పాల్గొన్నావనే ప్రశ్నించాం
మిర్యాలగూడ, సెప్టెంబరు 23: ఓ కేసు విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన ఎస్‌ఐ తనను తీవ్రంగా కొట్టారని ఓ గిరిజన యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈనెల 9న జరిగిన ఈ ఘటనపై బాధితుడు దానావత్ సాయిసిద్ధు తన కుటుంబసభ్యులు, గిరిజన నాయకులతో కలిసి మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
”నా స్వగ్రామం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొత్తపేట తండాలో ఈనెల 2న జరిగిన ఓ వివాదంపై వాడపల్లి పోలీ్‌సస్టేషన్‌లో ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకున్నాయి. దీని విచారణ కోసం ఈనెల 9న ఉదయం పోలీసులు మా ఇంటికి వచ్చారు. ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి స్టేషన్‌కు తీసుకురమ్మన్నారని చెప్పి నన్ను కులం పేరుతో దూషిస్తూ, చేతులతో కొడుతూ పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఈనెల 3న మిర్యాలగూడలో యూరియా కోసం జరిగిన ధర్నాలో ఎందుకు పాల్గొన్నావని కాళ్లు కట్టేసి కొట్టారు. ఈ దెబ్బల వల్ల నడవలేని స్థితిలో ఉన్న నాకు ట్యాబ్లెట్లు ఇచ్చి అదేరోజు సాయంత్రం మిర్యాలగూడ కోర్టులో హాజరుపరిచారు. నాపై పోలీస్ స్టేషన్‌లో జరిగిన హింస గురించి న్యాయమూర్తికి చెప్పాను. ఆయన నాకు రిమాండ్ విధించి, వైద్యపరీక్షలు చేయించాలని ఆదేశించారు. ఈ విషయమై నా భార్య భూమిక ఈనెల 15న ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో ఫిర్యాదుచేయగా, 22న బెయిల్ మంజూరు అయింది. విచారణ పేరుతో విచక్షణారహితంగా కొట్టి కులం పేరుతో దూషించిన ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలి” అని సాయి సిద్ధు కోరాడు. గిరిజన యువకుడిపై ఎస్‌ఐ చేసిన దాడి అమానుషమని, ఎస్‌ఐపై చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళన చేస్తామని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌నాయక్ హెచ్చరించారు. ఈ ఆరోపణలపై ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డిని ప్రశ్నించగా.. ‘ఓ కేసు విచారణ నిమిత్తం సాయిసిద్ధును మొదట స్టేషన్‌కు పిలిపించినా రాలేదు. దీంతో 9న సిబ్బందిని పంపి స్టేషన్‌కు తీసుకొచ్చాం. విచారణకు ఎందుకు రాలేదని ప్రశ్నించాం. యూరియా కోసం ధర్నా చేసేందుకు మిర్యాలగూడకు వెళ్లానని చెప్పాడు. నీకు భూమి లేనప్పుడు యూరియాతో ఏం పని అని ప్రశ్నించామే తప్ప.. సాయిసిద్ధును కొట్టలేదు’ అని ఎస్‌ఐ వివరణ ఇచ్చారు.




