
ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రులు.. ప్రజా సమస్యలా? విభేదాలా?!
ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే వాయిస్ వినిపిస్తోంది.
శాసనసభకు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభలో అడుగు పెడతానని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. ఈ తరుణంలో విపక్షం లేకపోవడంతో శాసనసభ అంత రక్తి కట్టించడం లేదు.
అయితే గత రెండు రోజులుగా జరుగుతున్న సమావేశాల తీరు చూస్తుంటే మాత్రం.. అధికార కూటమిలోనే కొన్ని పార్టీలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుండడం విశేషం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు జనసేన మంత్రులను.. టిడిపి మంత్రులను జనసేన ఎమ్మెల్యేలు ప్రశ్నలు సంధిస్తున్నారు.
శాఖల పరమైన వైఫల్యాలను ఎండగడుతున్నారు. నిలదీసినంత పని చేస్తున్నారు. అయితే ప్రజా సమస్యల రూపంలోనే ఈ ప్రశ్నలు లేవనెత్తుతుండగా.. ఈ ప్రభావం కూటమిపై పడుతుందన్న ఆందోళన అన్ని పార్టీల్లో ఉంది.
కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. మరో 15 ఏళ్ల పాటు కూటమి ఇలానే కొనసాగుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తేల్చి చెబుతున్నారు. అయితే దీనిపై ఎక్కడైనా జనసేన నేతలు మాట్లాడితే చర్యలకు ఉపక్రమిస్తున్నారు.
కూటమి ధర్మానికి విఘాతం కల్పించిన చాలామంది ఇన్చార్జిలపై వేటు వేశారు కూడా. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితిని అదుపులోకి తెచ్చినా.. శాసనసభలో వ్యవహారం చూస్తుంటే మాత్రం రెండు పార్టీల మధ్య సమన్వయం దెబ్బతింటుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు ప్రశ్నలు వేసుకుంటూ సమాధానాలు రాబెడుతున్నారు.
ఈ క్రమంలో కొంతమంది ఎమ్మెల్యేల తడబాటు కూడా కనిపిస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడంతో.. కూటమి ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుండడం విశేషం.