KhammamKusumanchiPoliticalTelangana

కాంగ్రెస్‌ నాయకులు, పోలీసుల వేధింపులతో.. బీఆర్‌ఎస్‌ నేత ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్‌ నాయకులు, పోలీసుల వేధింపులతో.. బీఆర్‌ఎస్‌ నేత ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్‌ నాయకులు, పోలీసుల వేధింపులతో.. బీఆర్‌ఎస్‌ నేత ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్‌ పభుత్వం చేస్తున్న మోసాలను, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు చేస్తున్న అక్రమాలను సోషల్‌మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నందుకుగాను కాంగ్రెస్‌ నాయకులు,

పోలీసులు కలిసి తనను అనేక రకాలుగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల బీఆర్‌ఎస్‌ ఉపాధ్యక్షుడు, బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విభాగ మండల అధ్యక్షుడు బానోత్‌ రవి (ఆర్మీ రవి) సోమవారం తిరుమలాయపాలెం మండలంలో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అతడు ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి గల కారణాలను; కాంగ్రెస్‌ నేతలు, పోలీసుల వేధింపులను తన మొబైల్‌ ఫోన్‌లో వీడియోగా రికార్డు చేసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.

ఆ పోస్టులో వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు చేసే అక్రమాల గురించి, ఎన్నికల సమయంలో పొంగులేటి ఇచ్చిన హామీల గురించి సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నందుకు కాంగ్రెస్‌ నాయకులు నాపై కక్షగట్టారు. పోలీసులతో కలిసి నన్ను చంపేందుకు ప్రయత్నించారు.

మంత్రి పొంగులేటి మేనల్లుడైన మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు రామసహాయం నరేశ్‌రెడ్డి, ఖమ్మం రూరల్‌ ఏసీపీ తిరుపతిరెడ్డి, తిరుమలాయపాలెం ఎస్‌ఐ కూచిపూడి జగదీశ్‌ తదితరులు కలిసి నన్ను హత్య చేసేందుకు ప్లాన్‌ చేశారు.

ఆ పథకం ప్రకారం ఈ నెల 9న ఖమ్మం రాపర్తినగర్‌ ఏరియాలో కొంతమంది వ్యక్తులతో నన్ను హత్య చేయించేందుకు ప్రయత్నించారు.

అది విఫలం కావడంతో నాపై ఖమ్మం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్లో అక్రమ కేసు బనాయించారు. గతంలోనూ మరిపెడ బంగ్లా, తిరుమలాయపాలెం పోలీస్టేషన్లలో నాపై తప్పుడు కేసులు పెట్టారు.’ అని ఆరోపించారు.

‘నా ఆత్మహత్యకు కారణమైన అధికార పార్టీ నేతలపైనా, పోలీసులపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.’ అని డిమాండ్‌ చేశారు. కాగా, పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బీఆర్‌ఎస్‌ నేత బానోత్‌ రవిని స్థానికులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతున్న రవిని బీఆర్‌ఎస్‌ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, బీఆర్‌ఎస్‌ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, బీఆర్‌ఎస్‌ తిరుమలాయపాలెం మండల అధ్యక్షుడు బాషబోయిన వీరన్న సహా ఇతర నేతలు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button