
ఇద్దరు పురుషుల మధ్య స్నేహం, అసహజ శృంగార బంధానికి దారి… చివరికి హత్య
ఖమ్మం రూరల్ ఎసిపి తిరుపతి రెడ్డి వివరణ
రెండు తులాల బంగారం, డబ్బు అశ ఒక వ్యక్తిని దారుణంగా హతమార్చింది. డబ్బు కోసం స్నేహనికి సైతం వెన్నపొటు పొడిచారు. హోమో సెక్స్‌వల్‌తో ఏర్పడిన పరిచయం కాస్తా స్నేహంగా మారి.. తీరా ప్రాణం తీసే వరకు వచ్చింది.
ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకరిని దారుణంగా చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి హత్య ఆనవాళ్ళు లేకుండా చేసిన ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
ఖమ్మం రూరల్ ఎసిపి తిరుపతి రెడ్డి గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్‌టిఆర్ జిల్లా, వత్సవాయి మండలం, చిట్యాలకు చెందిన పరిమి అశోక్ (36) ఎం.ఫార్మసీ చదువుకున్నాడు.
నాలుగైదేళ్ల క్రితం అతని తల్లిదండ్రులు అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి ప్రయివేట్‌గా వివిధ పనులు చేసుకుంటున్నప్పటికీ, తద్వారా వచ్చే ఆదాయం అతని జల్సాలకు సరిపోవడం లేదు. దీంతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుని వంగతోట వేయాలని నిర్ణయించుకున్నాడు.
ఇందుకోసం తనకు తెలిసిన కొందరి వద్ద అప్పులు చేసి సేద్యం చేయగా, నష్టాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే అతనికి ఖమ్మం క్యూర్ హాస్పిటల్‌లో ఆయాగా పనిచేస్తున్న తిరుమలాయపాలేం మండలానికి చెందిన కొమ్ము నగ్మా (32)తో ఏర్పడిన పరిచయం కాస్తా వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఇదే దశలో ఖమ్మం జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద కామేపల్లి మండలం, కెప్టెన్ బంజరకు చెందిన గట్ల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్ (40)తో అశోక్ కు ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి, ఇద్దరి మధ్య స్వలింగ సంపర్కానికి దారితీసింది.
ఖమ్మం దానవాయిగూడెం సమీపంలోని అశోక్ గదికి వెంకట్ వెళ్ళినప్పుడల్లా అతని ఖర్చులకు కొంత డబ్బు ఇస్తుండేవాడు. ఈ క్రమంలో బల్లేపల్లి సమీపంలోని బాలపేటకు చెందిన పెంటి కృష్ణయ్య అలియాస్ కృష్ణ రామస్వామి అనే వ్యక్తితోనూ కూడా అశోక్‌కు పరిచయం ఏర్పడింది. ఇది వీరి మధ్య స్నేహం బలపడింది.
ధనవంతుడిలా కనిపించే వెంకట్ తన గదికి ఈసారి వచ్చినపుడు అతన్ని ఎలాగైనా చంపి, అతని వద్దగల బంగారం, డబ్బు తీసుకోవాలని అశోక్‌తోపాటు అతని మిత్రులైన కృష్ణ, నగ్మా పథకం వేశారు. మనిషిని ఎలా చంపాలి, చంపిన మనిషి అవయవాలను ఎలా విడిభాగాలుగా చేయాలి? అనే విషయాలపై యూట్యూబ్‌లో అశోక్ తెలుసుకున్నాడు.
హత్యకు అవసరమైన కత్తులను కూడా కొనుగోలు చేశాడు. సెప్టెంబర్ 15వ తేదీన రాత్రి 8.30 గంటల సమయంలో వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్ అశోక్ గదికి వచ్చి నిద్రపోయాడు.
ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్న నిందితులు గత నెల 16వ తేదీన వెంకట్ నిద్రిస్తున్న సమయంలో నగ్మాను అశోక్ బయట కాపలాగా ఉంచి, నిద్రలో వెల్లకిలా పడుకున్న వెంకట్ గొంతుపై కత్తితో బలంగా నరకడంతోపాటు, మెడపైనా పలుసార్లు పొడిచాడు. దీంతో వెంకట్ తలా, మొండెం వేరయ్యాయి.
ఆ తర్వాత అదే కత్తితో వెంకట్ శరీరాన్ని ముక్కలుగా, ముక్కలుగా నరికి కవర్లలో శరీరభాగాలను దూర్చి, దుప్పటిలో మూటగా కట్టి, బైక్‌పై దుప్పటి మూటను తీసుకువెళ్లి, కవర్లలో కూర్చిన వెంకట్ శరీర భాగాలను కరుణగిరి ప్రాంతంలోని పొదల్లో విసిరేశాడు. ఆ తర్వాత ఘటనకు పాల్పడిన గదిని రక్తపు మరకలు లేకుండా శుభ్రం చేశాడు.
అయితే తన సోదరుడు కనిపించడం లేదంటూ వెంకట్ తమ్ముడు కొండ యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముందు ‘మిస్సింగ్’ కేసుగా నమోదు చేశారు. అయితే ఈ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో ఈ కేసు మిస్సింగ్ నుంచి మర్డర్‌గా మారింది.
మృతుడి సెల్‌ఫోన్ డేటాను సేకరించడంతో హత్యోందం వెలుగుచూసింది. అశోక్, నగ్మా, కృష్ణ కలిసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి ఒక బైక్ ను, హత్యకు గురైన వ్యక్తి నుంచి దోచుకున్న 2.7 తులాల బంగారు గొలుసును, నాలుగు సెల్ ఫోన్లను, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరిచిన సింగరేణి సిఐ తిరుపతిరెడ్డి, కామేపల్లి ఎస్‌ఐ సాయికుమార్, కారేపల్లి ఎస్‌ఐ గోపి, కానిస్టేబుల్స్ అంజి, ఆనంద్, సంపత్, రాజేష్‌ను సిపి సునీల్ దత్, ఎసిపి తిరుపతిరెడ్డి అభినందించారు.




