
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత..
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు కొండా లక్ష్మారెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో అనారోగ్యంతో హైదర్‌గూడ అపోలోని ఆస్పత్రిలో ఆయన మృతి చెందారు. మహా ప్రస్థానంలో మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్ (NSS) మేనేజింగ్ డైరెక్టర్ కొండా లక్ష్మారెడ్డి కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు.
దీంతో, కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
జర్నలిజం పట్ల మక్కువతో ఆయన 1980లో స్థానిక వార్తా సంస్థ NSSను ప్రారంభించారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు.
ఆయన రాజకీయ జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉంది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనవడు.
తన రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్‌తో సహా వివిధ పదవులను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా మండలి ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. 1999, 2014లో హైదరాబాద్ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు.