
ఖబడ్దార్ మంత్రులను రోడ్లపై తిరగనివ్వం.. బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని అడిగితే విజిలెన్స్ దాడులంటూ బ్లాక్మెయిల్ చేస్తారా.. అంటూ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లోని నల్లకుంట పరిధిలోని ఉన్న శంకర్‌మఠ్‌కు వెళ్లారు.
అక్కడ బండి సంజయ్, శ్రుంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల, యాజమాన్యాల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు.
తాము బ్లాక్మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకుంటామా అని హెచ్చరించారు. కమీషన్లు రావనే సాకుతోనే సర్కార్ పెద్దలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని కూడా కాలరాస్తారా అని ధ్వజమెత్తారు. పదేపదే ఇచ్చిన మాటను తప్పే వాళ్లను ఏమనాలని బండి సంజయ్ ఆక్షేపించారు.
బీహార్ ఎన్నికలకు పైసలు ఇక్కడి నుంచే పంపుతున్నారు కదా.. అంటూ బండి సంజయ్ సెటైర్లు వేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేని దిన స్థితిలో ప్రభుత్వం ఉందా.. అని అన్నారు. తక్షణమే బకాయిలు రూ.10 వేల కోట్లు చెల్లించాలని లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని అన్నారు.
విద్యార్థులు, యాజమాన్యాలతో కలిసి.. ఖబడ్దార్ మంత్రులను రోడ్లపై తిరగనీయబోమని వార్నింగ్ ఇచ్చారు. ఇక కళాశాలల యజమాన్యాలు కూడా ప్రభుత్వానికి భయపడి సమ్మె విరమిస్తే అంతే సంగతులని కామెంట్ చేశారు. అలా చేస్తే.. భవిష్యత్తులో వారికి ఎవరూ అండగా నిలబడే పరిస్థితి ఉండదన్నారు.
మరోవైపు ఆరోగ్యశ్రీ బకాయిలపైనా ప్రైవేటు ఆసుపత్రులు రోడ్డెక్కడం తథ్యమని అన్నారు. మంత్రులు ప్రతి పనికి కమీషన్లు వసూలు చేస్తున్నారని.. వచ్చిన సొమ్మును కాంగ్రెస్ హైకమాండ్‌కు కప్పం కడుతున్నారని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు.