
మరో బస్సు ప్రమాదం.. హైటెన్షన్ వైర్ తగిలి బస్సు దగ్ధం..
కర్నూలులో ఘోర బస్సు ప్రమాదాన్ని మరువక ముందే మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో బస్సు హైటెన్షన్ వైర్ తాకి మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు దగ్ధమైంది.
ఇద్దరు సజీవదహనం కాగా.. పలువురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్థాన్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది . ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.
జైపూర్-ఢిల్లీ జాతీయ రహదారిపై మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఉత్తరప్రదేశ్ నుంచి తోడిలోని ఇటుక బట్టీకి కార్మికులను తీసుకెళ్తోంది.
జైపూర్ గ్రామీణ జిల్లా షాపురా సబ్ డివిజన్‌లోని మనోహర్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతం వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. బస్సు రన్నింగ్‌లో ఉండగా.. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలాయి.
వెంటనే భారీ శబ్దం వచ్చి.. మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. సుమారు 12 మంది గాయాలతో బయటపడ్డారు.
ఈ ప్రమాదంలో బస్సు మొత్తం దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.



