
“నా కోరిక తీర్చు..” మహిళా లెక్చరర్ల లైంగిక, మానసిక వేధింపులకు విద్యార్థి బలి
విశాఖపట్నంలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరమైన విషాదం చోటుచేసుకుంది. డిగ్రీ విద్యార్థి అనుమానస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందడడం తీవ్ర సంచలనం రేపింది. అయితే అతడి మృతికి కాలేజీ లెక్చరర్ల లైంగిక వేధింపులే కారణమని విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. విశాఖ ఎంవీపీకాలనీ సెక్టార్-4లో నివాసముంటున్న కోన సాయితేజ్ (21) సమతా కళాశాలలో డిగ్రీ కంప్యూటర్ సైన్స్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. 5 వ సెమిస్టర్ పరీక్షలు రాసిన తరువాత నుంచి అతనికి అధ్యాపకురాలి నుంచి వేధింపులు మొదలయ్యాయి.
సరిగా మార్కులు వేయకపోవడంతోపాటు, రికార్డులు మళ్లీమళ్లీ రాయిస్తుండటం, సెల్‌ఫోన్‌లో వాట్సప్ మెసేజ్‌లు పెడుతూ వేధింపులకు గురి చేస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ విషయాన్ని శుక్రవారం మధ్యాహ్నం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఎంవీపీ కాలనీ స్టేషన్‌కు వెళ్లారు.
అధ్యాపకురాలు పెట్టిన వాట్సప్ మెసేజ్‌లు చూపించి ఫిర్యాదు చేశారు. ఈ లోపు ఇంట్లో ఒంటరిగా ఉన్న సాయితేజ్ ఫ్యాను హుక్కుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా కుమారుడు ఉరేసుకుని ఉండటం చూసి గుండెలవిసేలా విలపించారు.
ఎంవీపీ స్టేషన్ సీఐ ప్రసాద్ మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడు సాయితేజ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అధ్యాపకురాలితో జరిగిన వాట్సప్ సందేశాలను పరిశీలిస్తున్నారు.
‘శైలు చనిపోయినప్పుడు వెళ్లావు కదా ? నేను చనిపోయినప్పుడు వస్తావా ? నేను కంప్లైయింట్ చేశానని కోపం వచ్చిందా ? నువ్వు ఛేంజ్ అవ్వకపోతే కష్టం, ఎంత సేపు బాబాయ్ ఏం అంటారో అదే సోదా ? ఈ లైఫ్‌లో మాట్లాడకూడదు.
మొహం చూడకూడదు, మర్చిపోవాలి అని డిసైడ్ అయిపోయా ! ,’ అంటూ మానసికంగా ఒత్తిడికి గురిచేసేలా ఉన్న అధ్యాపకురాలి మెసేజ్‌లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వీటితోపాటు గతంలో జరిగిన సంభాషణలు, వాట్సప్ కాల్ డేటాను బయటకు తీసి విచారణ చేస్తున్నారు.
ఈ విషయంపై సమతా కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావును వివరణ కోరగా అధ్యాపకురాలి వేధింపుల గురించి విద్యార్థి తనకు ఫిర్యాదు చేయలేదని, ముందే తన దృష్టికి తీసుకొచ్చి ఉంటే ఇంత వరకు వచ్చేది కాదని చెప్పారు. సాయితేజ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసిన సహచర విద్యార్థులు కళాశాలలో ఆందోళనకు దిగారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. సాయితేజ్ మంచి విద్యార్థి అని, అధ్యాపకురాలి వేధింపుల కారణంగా ఆత్యహత్య చేసుకున్నాడని ఆరోపించారు.




