
5 గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలపాలి
•కేంద్ర హోంమంత్రి అమిత్ షా,
•రెండు రాష్ట్రాల సీఎంలకు తుమ్మల లేఖ
•ఏపీలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో లేఖ
•భద్రాద్రి రాముడు తెలంగాణలో …
శ్రీ రాముడి భూములు ఆంధ్రాలో….
•పరిపాలనా సమస్యలు,గిరిజనుల ఇబ్బందులు…
•డంపింగ్ యార్డ్ కు సైతం స్థలం లేని దుస్థితి
•చారిత్రక అనుబంధం ప్రస్తావించిన మంత్రి తుమ్మల
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా , తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి లకు తెలంగాణ వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు బుధవారం కీలక లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో భద్రాచలం పరిసర ఐదు గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని, పునర్విభజన చట్టంలోని ఉభయ రాష్ట్రాల చర్చల సందర్భంగా ఈ అంశాన్ని సానుకూలంగా చర్చించి తెలుగు ప్రజల ముఖ్యంగా భద్రాద్రి, ఐదు గ్రామాల ప్రజల తీరని వేతలు తీర్చేలా ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి తుమ్మల విన్నవించారు.
పునర్విభజన చట్టంలోని భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ఉన్న యాటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల పంచాయతీలను తిరిగి తెలంగాణ రాష్ట్రానికి చేర్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
భద్రాచలం చారిత్రక అనుబంధం….
తుమ్మల లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం—2014 రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం పట్టణం తెలంగాణలోకి వచ్చినప్పటికీ, దీని చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని పేర్కొన్నారు.
గిరిజనుల కష్టాలు — అంతర్రాష్ట్ర తనిఖీలు
ఈ గ్రామాల ప్రజలు, ముఖ్యంగా ఆదివాసీ కుటుంబాలు, ఆరోగ్యం–విద్య–రవాణా వంటి అవసరాల కోసం సహజంగానే భద్రాచలం పైనే ఆధారపడుతున్నారని తుమ్మల వివరించారు.
అయితే రాష్ట్ర సరిహద్దు మార్పుతో ప్రతి చిన్న పనికీ అంతర్రాష్ట్ర తనిఖీలు,వైద్య అత్యవసరాల్లో ఆలస్యం,పాఠశాలలు, హాస్టళ్లకు చేరడంలో ఇబ్బందులు,అభివృద్ధి పనుల్లో అధికార పరిధి గందరగోళం లాంటివి ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయని మంత్రి తుమ్మల వెల్లడించారు.
తీవ్రవాద ప్రభావిత ప్రాంతం – సమన్వయ లోపం
ఈ మండలాల పరిధి ఎల్‌డబ్ల్యూఈ (LWE) సున్నిత ప్రాంతం కావడంతో శాంతిభద్రతల సమన్వయంలో రెండు రాష్ట్రాలకు సవాళ్లు పెరిగాయని తుమ్మల తన లేఖలో స్పష్టం చేశారు. పరిపాలనా సులభతరం కోసం ఈ ప్రాంతం ఒకే రాష్ట్రానికి చెందడం ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు.
దేవస్థానం భూములు ఏపీలో ….
ప్రసిద్ధ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం తెలంగాణలో ఉండగా, అనుబంధ ఆలయ ఆస్తులు, భూములు పురుషోత్తపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉండటం వల్ల రికార్డులు, పరిపాలన, అభివృద్ధి ప్రణాళికల్లో చిక్కులు ఎదురవుతున్నాయని తుమ్మల పేర్కొన్నారు.
డంపింగ్ యార్డ్, ఇతర దేవాలయ అవసరాల కోసం భూములు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని వివరించారు.
ప్రస్తుతం భద్రాచలం పట్టణం మాత్రమే ఇక్కడ ఉందని ఐదు గ్రామాలను తెలంగాణలో కలిపి భద్రాచలానికి అనుసంధానం చేస్తే భద్రాద్రి రామయ్య ఆలయం అభివృద్ధి, గిరిజన సాంప్రదాయ చారిత్రాత్మక వైభవం అలారారుతుందన్నారు. ప్రస్తుతం తెలంగాణ మధ్యలో ఆంధ్ర మళ్ళీ తెలంగాణ ఉండటం వల్ల అనేక చిక్కులు ఎదురవుతున్నాయని ప్రస్తావించారు.
ప్రజల దశాబ్దాల డిమాండ్ – రాజకీయ కోణం కాదని స్పష్టం
గత పదేళ్లుగా ఈ గ్రామాల కలయికపై గిరిజన సమాజం, ప్రజా సంఘాలు,స్థానిక గ్రామ సభల నుంచి తరచూ అభ్యర్థనలు వస్తూనే ఉన్నాయని, ఇది రాజకీయ కోణం కాదని , పూర్తిగా ప్రజల మనోభావాలు, పరిపాలనా ప్రయోజనాలపై ఆధారపడిన డిమాండ్ అని తుమ్మల లేఖలో చెప్పారు.
ఏపీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో పరిశీలించాలని అభ్యర్థన
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న జిల్లా సరిహద్దుల పునర్విభజన ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని, ఈ ఐదు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ నుంచి మినహాయించి, కేంద్ర ప్రభుత్వం సహకారంతో వాటిని తెలంగాణకు పునరుద్ధరించే అంశాన్ని పరిశీలించాలని తుమ్మల కోరారు.
“ప్రజల దశాబ్దాల ఆకాంక్షకు న్యాయం చేయాలి” — తుమ్మల విశ్వాసం
దశాబ్ద కాలంగా తెలంగాణ లోని భద్రాచలం ఐదు పరిసర గ్రామాల ప్రజలు ఆకాంక్ష నెరవేర్చేలా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద మనసుతో అంగీకరించాలని మంత్రి తుమ్మల అభ్యర్థించారు. రెండు రాష్ట్రాల కలసి పని చేసే భావంతో ఈ అంశం పరిష్కార దిశగా అడుగులు పడతాయని తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజల ఇబ్బందులు రెవిన్యూ శాంతి పద్ధతుల సమస్యలు పరిష్కారానికి ఈ అవకాశం ఎంతగానో ఉపయోగపడుతుందని తుమ్మల పేర్కొన్నారు. భద్రాద్రి రాముడు తెలంగాణలో భూములు మాత్రం ఏపీలో ఉండటంవల్ల రామయ్య సేవలకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు.
పునరుభజన చట్టం ఉభయ రాష్ట్రాల చర్చలలో కేంద్రం ప్రభుత్వం ఈ అంశాన్ని సానుకూలంగా చర్చించి భద్రాచలం పట్టణానికి పరిసర గ్రామాలను అనుసంధానం చేసేలా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.



