
“నా కూతుళ్లు పంపిన జీతమా”.. పరిహారం తీసుకుంటూ గుండెపగిలేలా ఏడ్చేసిన తండ్రి
ఇటీవల జరిగిన చేవెళ్ల బస్సు ప్రమాదం 19 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్లు కన్నుమూయడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చేతికివచ్చిన ముగ్గురు బిడ్డలను కోల్పోయిన తండ్రిని ఓదార్చడం ఎవ్వరి వల్ల కావడంలేదు.
తాజాగా ఎల్లయ్య గౌడ్‌కు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున రూ.21 లక్షల చెక్కును ప్రభుత్వం అందించింది. అయితే ఆ పరిహారం తీసుకుంటూ తండ్రి గుండెపగిలేలా ఏడ్చేశాడు.
తన రెండో కూతురు ఉద్యోగం చేస్తూ నెలకు రూ.60వేలు సంపాదించేదని చెప్పారు. ఇప్పుడు తన ముగ్గురు కూతుళ్లు కలిసి పంపిన జీతమా? అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
దీంతో ఆ తండ్రి బాధ చూసి పక్కన ఉన్నవాళ్లు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ముగ్గురు యువతుల్లో ఇద్దరు సాయి ప్రియ, నందిని కోఠి ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నారు.
మరో యువతి తనూష ఎంబీఏ చేస్తూ ఉద్యోగం చేస్తున్నట్టు తెలుస్తోంది. కాలేజీకి ఆలస్యం అవుతుందనే ముగ్గురూ ఆ బస్సుకు వెళ్లినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.



