
కాలేజీ హాస్టల్లో వాచ్ మెన్ నిర్వాకం.. తినే అన్నంలో కాళ్లు పెట్టి..!
మద్యం మత్తులో ఓ హాస్టల్ వాచ్‌మెన్ దారుణంగా వ్యవహరించారు. పూటుగా మద్యం తాగి విద్యార్థులకు వండిన అన్నంలో కాళ్లుపెట్టి నిద్రపోయాడు.
సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిల్‌ఖాన్ పేట శివారులోని పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్‌లో బుధవారం చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి.
పాలిటెక్నిక్ కళాశాలలో శేఖర్ అనే వ్యక్తి కొద్దికాలంగా వాచ్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఎప్పటిలాగే భోజనం చేసేందుకు విద్యార్థులు బుధవారం రాత్రి హాస్టల్‌కు వెళ్లగా అక్కడ అన్నంపాత్రలో కాళ్లుపెట్టుకుని నిద్రపోతున్న శేఖర్‌ను చూసి అవాక్కయ్యారు.
మద్యం మత్తులో ఉన్న వాచ్‌మెన్‌ను చూసి విద్యార్థులు ఇబ్బందికి గురయ్యారు. వెంటనే వార్డెన్‌కు సమాచారం అందించగా పైఅధికారులకు సమాచారం చేరవేశారు. అనంతరం అక్కడికి చేరుకుని అతడిని తక్షణమే విధుల నుంచి తొలగించారు.
స్పందించిన కలెక్టర్
హాస్టల్‌లో చోటుచేసుకున్న ఘటనపై కలెక్టర్ ప్రావీణ్య స్పందించారు. ఘటనపై పూర్తి నివేదికను కోరుతూ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఇచి్చన ఫిర్యాదు మేరకు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నివేదికను తయారుచేసి కలెక్టర్‌కు పంపించారు.
నివేదిక అందిన వెంటనే వాచ్‌మెన్ శేఖర్‌ను తొలగిస్తూ ఆదేశాలిచ్చారు. అలాగే కాంట్రాక్టర్‌కు హెచ్చరిక జారీ చేశారు. ప్రతిరోజు హాస్టల్ పర్యవేక్షణ కోసం ఒక ఉపాధ్యాయుడిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించాల్సిందిగా ప్రిన్సిపాల్‌కు సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వసతిగృహాలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.



